ఘన వ్యర్థాల నిర్వహణ సమర్థంగా అమలు చేయాలి

  • చెత్తను సంపదగా మార్చి గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్యాన్ని కాపాడాలి
  • పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ రావు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026ను సమర్థవంతంగా అమలు చేసి చెత్తను సంపదగా మార్చే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ రావు అధికారులను ఆదేశించారు. గ్రామాల పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమని, గ్రీన్ అంబాసిడర్లకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

బుధవారం చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 అమలు, గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల (ఎస్‌డబ్ల్యూపీసీ) సమర్థ నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లాలో సుమారు 2.50 లక్షల కుటుంబాలు, 12 లక్షల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ ఎంతో అవసరమని సుధాకర్ రావు తెలిపారు. గ్రామాల్లో పశువుల నుంచి వచ్చే పేడను రైతుల సహకారంతో సేకరించి వర్మీ కంపోస్టుగా తయారు చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇంటింటి నుంచి సేకరించే తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి, తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేయడంతో పాటు పొడి చెత్తను గ్రామ స్థాయిలో నిల్వ చేసి స్వచ్ఛ రథాల ద్వారా విక్రయించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

పొడి చెత్తను బయట పారేయకుండా దానికి ఆర్థిక విలువ కల్పించడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పెరగడమే కాకుండా, ఇంటి పన్ను సక్రమంగా చెల్లించే కుటుంబాలకు వార్షికంగా కనీసం 50 శాతం వరకు ప్రోత్సాహకాన్ని తిరిగి అందించే విధానంపై చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రీన్ అంబాసిడర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి అదనంగా రూ.5,000 వరకు ఆదాయం వచ్చే అవకాశాలను అన్వేషించాలని, స్వచ్ఛ రథాల నిర్వహకులకు కూడా పొడి చెత్త విలువపై పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శానిటరీ వ్యర్థాలు, డైపర్లు, మహిళల పరిశుభ్రతకు సంబంధించిన వ్యర్థాలతో పాటు మొత్తం 29 రకాల పొడి చెత్తను వర్గీకరించి వాటికి ప్రత్యేక ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొద్ది రకాల వ్యర్థాలను మాత్రమే సేకరిస్తున్న స్వచ్ఛ రథాల నిర్వహకులు మిగిలిన విలువైన పొడి చెత్తను కూడా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2018లో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసే కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఈ కార్యక్రమాలను మరింత విస్తరించి ఈ-ఆటోలు, స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రతి నెల ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించి సేవలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఈ-ఆటోలు అందించడంతో పాటు, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అధిక ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలకు వందకు పైగా చెత్త సేకరణ వాహనాలు అందించామని వెల్లడించారు. ఈ చర్యలతో రాష్ట్ర స్థాయి పరిశుభ్రత ర్యాంకింగ్‌లో జిల్లా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.

గతంలో గ్రీన్ అంబాసిడర్లకు నెలల తరబడి వేతనాలు అందని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుందని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ఒక్కరోజులో మార్పు సాధ్యం కాదని, నిరంతర అవగాహన కార్యక్రమాల ద్వారానే శాశ్వత ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ మాట్లాడుతూ పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి, టమాటా సీజన్‌లో రహదారుల పక్కన వ్యర్థాలు పేరుకుపోయే పరిస్థితులు ఎదురైనా అధికారులు నిరంతరం చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పంచాయతీ సిబ్బంది, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు క్రమం తప్పకుండా శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. “స్వచ్ఛ పథం”, “స్వచ్ఛ రథం” కార్యక్రమాల ద్వారా రహదారుల వెంట పేరుకుపోయే చెత్తను తొలగించడం, పొడి చెత్తను సేకరించడం జరుగుతోందని తెలిపారు. ఈ చర్యల ఫలితంగా రాష్ట్ర స్థాయి పరిశుభ్రత ర్యాంకింగ్‌లో చిత్తూరు జిల్లా ఎనిమిదో స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీఎల్‌డీఓలు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, విలేజ్ సెక్రటరీలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.