నాలుగు కల్తీ బ్రాండ్లు..

- ఉలిక్కిపడిన ఇబ్రహీంపట్నం జనం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తున కల్తీ మద్యం స్పిరిట్ ను స్వాధీనం చేసుకోవడంతో మందుబాబులు కలవరానికి గురవుతున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ ఇబ్రహీంపట్నంలో ఓ కుటీర పరిశ్రమగా కల్తీ మద్యం తయారీ గోడౌన్ నిర్వహిస్తున్నాడు.
ఇతని అనుచరుడు కట్టా రాజు సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు సోమవారం విస్తృత సోదాలు నిర్వహించారు. మద్యం తయారీ మిషనరీలు, మూడు వేల లీటర్ల స్పిరిట్, మద్యం నింపిన 100 సీసాలు, వేలాది ఖాళీ సీసాలు, క్యాన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే!
ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ఓ కాంప్లెక్స్ లో గోడౌన్ ఏర్పాటు చేసి కొంతకాలం నుంచి గుట్టుగా పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కల్తీ మద్యం తయారీ అనే విషయాన్ని గుర్తించలేకపోయామంటున్నారు.
కాగా ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు కల్తీ మద్యం సరఫరా చేస్తునట్లు తెలుస్తోంది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో బార్ లు, వైన్స్ షాపుల్లో తనిఖీలు చేసిన ఎక్సైజ్ పోలీసులు కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని బార్ లు, వైన్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించ లేదు.
ఇక్కడ నుంచి ఏయే ప్రాంతాలకు కల్తీ మద్యం సరఫరా చేశారు? ఇంకెక్కడైనా మద్యం గోడౌన్ లు ఉన్నాయా? అనే విషయంపై ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం జనార్ధన్ సోదరుడు జగన్మోహన రావు, అనుచరుడు రాజును అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ఇబ్రహీంపట్నానికి చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
కల్తీ మద్యం తయారీలో ఇంకెవరెవరు ఉన్నారనే విషయంపై విచారిస్తున్నారు. క్లాసిక్ బ్లూ, మంజీరా బ్లూ, ఓఏబీ బ్రాండ్లను కల్తీ చేసినట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ బ్రాండ్లు తాగుతున్న మందుబాబుల్లో కలవరం మొదలైంది.
