భారీ వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి
వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: సీఐ టి. సంజీవ్
పాలేరు, ఆంధ్రప్రభ: పాలేరు నియోజకవర్గ పరిధిలోని మండలాల ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు డ్రైవింగ్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని పాలేరు సీఐ టి. సంజీవ్ సూచించారు.
భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో నివసించవద్దని, ఇనుప విద్యుత్ స్తంభాల సమీపంలో నడవవద్దని కోరారు. వర్షం కురుస్తున్న సమయంలో మత్స్యకారులు వాగులు, చెరువులకు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
వర్షాల సమయంలో రహదారులు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున వాహనాలను నెమ్మదిగా నడపాలని తెలిపారు. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వేగంగా మలుపులు తిరగడం, నీరు నిలిచిన రహదారులపై ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. నీటిలో కనిపించని గుంతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెగిపోయిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, వర్షపు నీటిలో విద్యుత్ ప్రసరించే ప్రమాదం ఉన్నందున వెంటనే సంబంధిత అధికారులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, వాహనాలను కూడా అక్కడ నిలిపివేయవద్దని సూచించారు. పాత భవనాలు, బలహీనమైన గోడలకు దూరంగా ఉండాలని తెలిపారు.
వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. వర్షంలో ప్రయాణించే సమయంలో హెడ్లైట్లు ఆన్‌లో ఉంచాలని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని తెలిపారు. ప్రజలు, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సీఐ టి. సంజీవ్ విజ్ఞప్తి చేశారు.
