ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌కు మరమ్మత్తులు
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌కు మరమ్మత్తులు
మే 26 నుంచి జూన్ 12 వరకు పనులు
ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో రిపేర్ వర్క్స్
పనుల సమయంలో ఘాట్ రోడ్ మూసివేత
భక్తుల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి వెళ్లే ఘాట్ రోడ్‌కు మే 26 నుంచి మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ తెలిపారు.
భక్తులకు మెరుగైన రవాణా, సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్ అండ్ బీ శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం మే 26 నుంచి జూన్ 12 వరకు వివిధ దశల్లో ఘాట్ రోడ్ మరమ్మత్తు పనులు కొనసాగనున్నాయి.
పనుల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కాలంలో ఘాట్ రోడ్‌ను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్ మూసివేత కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో వివరించారు.
ముఖ్యంగా శ్రీ కనకదుర్గ నగర్ వైపు నుంచి భక్తుల రాకపోకలు కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరుగుతున్నందున భద్రత, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి.
భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
