విజయవాడ అభివృద్ధిలో కొత్త శకం..
- రోల్ మోడల్ గా విజయవాడ
- గతంలో ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పనులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
- డబుల్ ఇంజిన్ సర్కార్‌తో నగరం రూపురేఖలు మారుతున్నాయి
- ఎంపీ కేశినేని చిన్ని
- తూర్పు నియోజకవర్గంలో ఒక్క రెండు రోజుల్లోనే రూ.15 కోట్ల పనులకు శ్రీకారం..
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ ప్రాంతంలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలోని 4, 10వ డివిజన్లలో చేపట్టనున్న రూ.3 కోట్లకు పైగా విలువైన బీటీ, సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు.4వ డివిజన్ భారతి నగర్ మెయిన్ రోడ్డుకు రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు, 10వ డివిజన్‌లోని ఫన్‌టైమ్స్ రోడ్డుకు రూ.1.92 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయాలు, పరిశ్రమలు, రాజధాని నిర్మాణం సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.
పోలవరం వంటి కీలక ప్రాజెక్టులతో పాటు చేపట్టిన పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ ప్రాంతంలో అభివృద్ధి వేగం ఎన్నడూ లేని విధంగా పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ఒక్క రెండు రోజుల్లోనే రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారం, కొండ ప్రాంతాల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ వంటి అనేక పనులు చేపడుతున్నామని తెలిపారు.
రానున్న రోజుల్లో విజయవాడను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాస్తి సాంబశివరావు, వి.గోపాలకృష్ణ, ఎం.సాయిబాబు, మిక్కిలినేని బుజ్జి, చలసాని రోజా, సౌజన్య, జాస్తి కృష్ణారావు, సురేంద్ర, డివిజన్ అధ్యక్షుడు మన్నే జయప్రకాష్, కార్యదర్శి జగన్మోహన్‌రావు, వై.రమేష్, బొర్రా గాంధీ, రాజేంద్రప్రసాద్, దర్శిత్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
