ప్రతి ఇంటా ఆరు మొక్కలు నాటి సంరక్షించాలి..

  • సర్పంచ్ వాణి కస్తూరి వెంకట్‌రాములు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటిలో కనీసం ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని వల్లంపల్లి సర్పంచ్ వాణి కస్తూరి వెంకట్‌రాములు పిలుపునిచ్చారు.నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని వల్లంపల్లి గ్రామంలో శనివారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులకు పండ్ల, నీడనిచ్చే, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పంపిణీ చేశారు.

అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలను అధిగమించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.

ప్రతి కుటుంబం కనీసం ఆరు మొక్కలు నాటి వాటిని పిల్లలను పెంచినట్లు సంరక్షిస్తే గ్రామం పచ్చదనంతో కళకళలాడుతుందన్నారు.మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీరు పోసి, రక్షణ కల్పించి పెంచాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరి, ఉప సర్పంచ్ నరసప్ప వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.