కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పనిచేద్దాం

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పనిచేద్దాం
- కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య
మరిపెడ, ఆంధ్రప్రభ: దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విప్లవ వీరుడు, గొప్ప పార్లమెంటు నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ప్రజా చైతన్యానికి వేగుచుక్క అని సామాజిక ఉద్యమకారులు, ప్రముఖ జర్నలిస్టు జిన్నా లచ్చయ్య కొనియాడారు. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో ఆదర్శ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభను సీఐటీయూ, సీపీఎం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. సీపీఎం వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
అదేవిధంగా గుండెపుడి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో అమరజీవి, కమ్యూనిస్టు గాంధీగా పిలవబడే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుందరయ్య అంటే కేవలం ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప ఆలోచనపరుడని కొనియాడారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ గ్రంథంతో పాటు వీర తెలంగాణ విప్లవ పోరాటానికి నాంది పలికిన మహనీయుడని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సుందరయ్య జీవితంలో అత్యంత చారిత్రాత్మక అధ్యాయమన్నారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల వెట్టిచాకిరి వ్యవస్థకు వ్యతిరేకంగా ‘దున్నేవానికే భూమి’ అనే నినాదంతో కూలీలను, రైతులను సమీకరించి పోరాటాన్ని నడిపిన వీరుడని గుర్తుచేసుకున్నారు.
1946 నుండి 1951 వరకు సాగించిన చారిత్రాత్మక పోరాటంలో సుదీర్ఘ కాలం అజ్ఞాత జీవితాన్ని గడిపినప్పటికీ ఆయన తన ఆశయాలను విడిచిపెట్టలేదన్నారు. రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారని తెలిపారు. ఆనాటి నిరంకుశ ప్రభుత్వం వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల బలిదానాలు, త్యాగాల ఫలితంగానే నాాడు 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచడం సాధ్యమైందన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. డబ్బు, కులం, మతం, కార్పొరేట్ శక్తుల ప్రభావం రాజకీయాలను శాసిస్తున్న ప్రస్తుత రోజుల్లో సుందరయ్య లాంటి నిష్కళంక నాయకుడిని ఆదర్శంగా తీసుకుని నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
ఈ సంస్మరణ కార్యక్రమాల్లో గ్రామ శాఖ కార్యదర్శి కొండ ఉప్పలయ్య, సీనియర్ నాయకులు నందిపాటి వెంకన్న, కామిండ్ల వెంకన్న, జిన్నా మాధవి పాల్గొన్నారు. వీరితో పాటు సీఐటీయూ నాయకులు జినక కృష్ణమూర్తి, సైదులు, చుక్క మల్లయ్య, జిన్నా ధనమ్మ, ఉపేంద్ర, గంగా, సావిత్ర, సుభద్ర హాజరయ్యారు. గుండెపుడి సీపీఎం పార్టీ శాఖ కార్యదర్శి భయ్యా సురేష్, కందాల రమేష్, గంధసిరి మహేష్, మారబోయిన రమేష్, సైకిమెంట్ సాహెబ్, అల్లి శ్రీనివాస్ రెడ్డి, బయ్య నరేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
