పోడు రైతుల గోడు విన్న మంత్రి జూపల్లి..
- 2005కు ముందు సాగు చేసిన భూములకే పట్టాలు: మంత్రి
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఎన్నో తరాల నుండి సాగులో ఉన్న పంట భూములను అటవీ అధికారులు, సిబ్బంది అడ్డుకుంటూ తమ భూములు లాక్కుంటున్నారని పోడు భూముల రైతులు గోడు వెళ్ళబోసుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో పర్యటించిన పర్యాటక, సంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కెరమెరి మండలం సుర్దాపూర్, పలు గిరిజన గ్రామాల రైతులు కలిసి తమ సమస్యను విన్నవించారు. పోలీసులు, అటవీ సిబ్బంది తమ భూముల్లోకి వచ్చి మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని, దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇవ్వడం లేదన్నారు. అటవీ శాఖ, పోలీసుల ఆదిపత్యంపై తమకు న్యాయం చేయాలని మంత్రినీ వేడుకున్నారు.

- 2005 కు ముందు సాగు భూములకే పట్టాలిస్తాం…!
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 2005 అటవీ హక్కుల చట్టాల మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో పట్టాలు అందిస్తున్నామని, అలాంటి వారికి తాము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సుర్తాపూర్ రైతుల సమస్యను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని, పోడు భూముల్లో అటవీ సిబ్బంది, అధికారులు వెళ్లి అడ్డంకులు సృష్టించవద్దని మంత్రి సూచించారు. పోడు భూములకు పట్టాల అంశం కేంద్ర ప్రభుత్వం దేననీ , ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. - అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం..
జిల్లాకు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ లతో పాటు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్, ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ ముందుగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం మానిక్ గూడ, వాంకిడి మండలం కోమటి గూడలలో రూ.20లక్షల వ్యయంతో గ్రామపంచాయతీ భవనాలతో పాటు, కెరమెరి మండలం ధనోరా వద్ద రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూములు శాశ్వత ఆస్తి కాదని, పిల్లలే నిజమైన ఆస్తిపాస్తులని వారిని బాగా చదివించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
