ATM Theft | ఏటీఎంను ఈడ్చుకెళ్లి నగదు దోచేశారు

ATM Theft |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీఫక్కీలో ఏటీఎం దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు మహీంద్రా థార్ ఎస్‌యూవీ సాయంతో ఏటీఎం యంత్రాన్ని కియోస్క్ నుంచి బయటకు లాగి, అందులోని నగదును దోచుకుని పరారయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాలాసోర్ జిల్లా తురిగడియా మార్కెట్ సమీపంలోని ఇండియా వన్ ఏటీఎం కేంద్రంలో శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగులు ఏటీఎం యంత్రాన్ని థార్ వాహనానికి కట్టి కియోస్క్ నుంచి బయటకు లాగి, దాదాపు 200 మీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు.

అనంతరం ఏటీఎంను పగులగొట్టి అందులోని నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉందన్న విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.