సర్ ప్రక్రియను నెల రోజుల పాటు పొడిగించాలి
- ఓటర్లను చైతన్యం చేయడంలో అధికార యంత్రాంగం విఫలం
- సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగోని సత్యనారాయణ డిమాండ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగోని సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్లో నిర్వహించిన సిపిఐ మండల సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఓటర్లను చైతన్యం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. నియోజకవర్గం లో చాలా మందికి ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని, ఫారాలు నింపడంలో సరైన అవగాహన లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బి.ఎల్.ఓ లు ఇంటింటికీ తిరిగి ఫారాలు పంపిణీ చేయాల్సింది పోయి, ఓటర్లనే తమ వద్దకు వచ్చి ఫారాలు తీసుకోవాలని చెప్పడం సరికాదన్నారు.
గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించాలి
గ్రామ స్థాయిలో ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై సరైన అవగాహన కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని సత్యనారాయణ కోరారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగాలే తప్ప బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్రగా మారకూడదని ఆయన హెచ్చరించారు. ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఆలస్యం అవుతున్నందున, గడువును మరో నెల రోజులు పొడిగించి.. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా గల్లంతు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్, సిపిఐ మున్సిపాలిటీ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, నాయకులు ఉడత రామలింగం, కొండూరి వెంకటేష్, దాసరి అంజయ్య, టంగుటూరు రాములు, రోషణగారి అంజయ్య, రొండి నర్సింహా, బద్దుల సుధాకర్, నీళ్ల బిక్షపతి, కాకి పాండు, కుంటి పాపయ్య, దాసరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
