ప్రాజెక్టు ప్రభావంపై ఊట్కూర్‌లో అఖిలపక్ష సమావేశం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాలో జీవో 69 నారాయణపేట- మక్తల్ – కొడంగల్ ఎత్తిపోతలపథకం నిర్మాణంలో ఊట్కూర్ మండల కేంద్రానికి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై అఖిలపక్షం నాయకులు ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు సమావేశమై నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామానికి ఎదురయ్యే ప్రభావాలపై విస్తృతంగా చర్చించారు.
పెద్ద చెరువును రిజర్వాయర్‌గా విస్తరించే పనుల నేపథ్యంలో గ్రామం చెరువు మట్టానికి దిగువన ఉండటంతో భవిష్యత్తులో సీపేజ్ ప్రభావం, ఊటనీరు గ్రామంలోకి చేరే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 16న ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ప్రొఫెసర్లు రమణమూర్తి, వెంకటేశ్వర్ల బృందం తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారి శ్రీధర్ తో పాటు పలువురు ఊట్కూర్ పెద్ద చెరువు పరిశీలించిన నేపథ్యంలో అఖిలపక్షం నాయకులు పెద్దలు సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగాచర్చలుచేశారు.
ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో గ్రామంలోని పాత ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, దేవాలయాలు నీటి ప్రభావంతో శిథిలావస్థకు చేరే అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్ఐటీ వరంగల్ నిపుణుల బృందం నిర్వహించిన పరిశీలనలో గ్రామం లోతట్టు ప్రాంతంగా ఉన్నట్లు తేలిందని గుర్తుచేశారు. అయినప్పటికీ అధికారులు గ్రామ ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించకుండా ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అంచనా వేసి, రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, ఎంపీ డి.కే. అరుణ, జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులకు పూర్తి వివరాలతో వినతిపత్రాలు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు.
గ్రామ రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని అఖిలపక్ష నాయకులుహెచ్చరించారు. నాయకులు అధికారులు స్పందించకపోతే ఉద్యమాలు చేసేందుకుసిద్ధంకావాలని నిర్ణయించారు. ఊట్కూర్ పెద్ద చెరువు సామర్థ్యం ప్రస్తుతం సుమారు 1000 ఎకరాలు ఉండగా, రిజర్వాయర్ గా మారిస్తే నీటి సామర్థ్యం పెరిగి గ్రామంలో ఊటపెరిగి ఇండ్లు దెబ్బతింటాయనిఅన్నారు.
చెరువు సామర్థ్యం పెరిగిన గ్రామానికి ఎలాంటి నష్టం ఉండదని అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు డి పి ఆర్ ఇవ్వాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు ఎం బాల్ రెడ్డి, అరవింద్ కుమార్,ఎల్కోటి జనార్దన్ రెడ్డి,హన్మంతు, రమేష్, భరత్, గోపాల్, ఈ బాధూర్ రెహ్మాన్, కోరం శివారెడ్డి, ఆనంద్ రెడ్డి, ఎం.భరత్, శంకర్, తరుణ్ రెడ్డి, రోషనప్ప తదితరులు పాల్గొన్నారు.
