కైతాపురం ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: గంగదేవి సైదులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగదేవి సైదులు డిమాండ్ చేశారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో కైతాపురం దళితవాడలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో గత నాలుగేళ్లుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వాటర్ ఫిల్టర్ పాడవడంతో ప్రజలు డబ్బులు పెట్టి నీటిని కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితవాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు వంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలన్నారు. మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బోయ యాదయ్య, యాట బాలరాజు, నేరేడు మహేష్, తగరం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.