శ్రమకు రాష్ట్ర స్థాయి గౌరవం..
శ్రమకు రాష్ట్ర స్థాయి గౌరవం..
‘శ్రమ్ శక్తి’ అవార్డుకు లోకనాథుడు ఎంపిక
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పారిశ్రామిక రంగంలో శ్రమకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిన అరుదైన సందర్భంలో జై రాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఉద్యోగి చెన్న లోకనాథుడు ప్రతిష్ఠాత్మక “శ్రమ్ శక్తి” అవార్డుకు ఎంపికయ్యారు. పారిశ్రామిక సామరస్యం, కార్మిక సంక్షేమం, పనితీరు నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం సంస్థకు గర్వకారణంగా మారింది.
జై రాజ్ ఇస్పాత్ లిమిటెడ్ రోలింగ్ మిల్ వర్క్‌షాప్‌లో టర్నర్‌గా పనిచేస్తున్న లోకనాథుడు 2022 నవంబర్ నుంచి సంస్థలో సేవలందిస్తున్నారు. తక్కువ కాలంలోనే క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యం, పనిపట్ల అంకితభావంతో సహచర ఉద్యోగుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, యంత్రాల నిర్వహణలో చొరవ చూపడం, పని ప్రదేశంలో సామరస్య వాతావరణం నెలకొల్పడంలో ఆయన పాత్రను సంస్థ వర్గాలు ప్రశంసించాయి.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, శాఖ కార్యదర్శి ఎం.వి. శేషగిరి బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జై రాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ ఉద్యోగుల కృషే సంస్థ అభివృద్ధికి ప్రధాన బలమని పేర్కొన్నారు. లోకనాథుడికి లభించిన ఈ గౌరవం వ్యక్తిగత విజయమే కాకుండా సంస్థలో నెలకొన్న శ్రామిక అనుకూల వాతావరణానికి ప్రతిబింబమని తెలిపారు.
డైరెక్టర్ రాజశ్రీ జైన్ మాట్లాడుతూ ఉద్యోగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే సంస్కృతిని సంస్థ కొనసాగిస్తోందని చెప్పారు. ప్రతి ఉద్యోగి తన పనిని గౌరవంగా భావించే వాతావరణం వల్లే ఇలాంటి గుర్తింపులు సాధ్యమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
అవార్డు స్వీకరించిన అనంతరం లోకనాథుడు స్పందిస్తూ సంస్థ అందిస్తున్న ప్రోత్సాహమే తనకు ప్రేరణగా నిలిచిందన్నారు. సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైన తన ప్రయాణంలో రాష్ట్ర స్థాయి గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిశ్రమల్లో ఉత్పాదకతతో పాటు ఉద్యోగుల సంక్షేమం, భద్రత, మానసిక ఉల్లాసం వంటి అంశాలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ గుర్తింపు పారిశ్రామిక రంగానికి సానుకూల సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
