సొంత గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే షిండే

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు కావాలి: హన్మంత్ షిండే

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో నమోదు కావాలని, ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.

శనివారం జుక్కల్ మండలంలోని తన స్వగ్రామం డోన్‌గాంలో సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్‌తో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలను పూర్తిచేసి బీఎల్‌ఓకు అందజేయాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే గ్రామ సర్పంచ్ లేదా సంబంధిత బీఎల్‌ఓను సంప్రదించాలని తెలిపారు.

సీజనల్ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఫారాలను వారి కుటుంబ సభ్యులు లేదా బంధువుల ద్వారా పూర్తిచేసి గడువులోపు సమర్పించాలని కోరారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులు కూడా ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించాలని సూచించారు.

అనంతరం గ్రామస్తులతో ఎస్‌ఐఆర్ ఫారాలు పూర్తిచేయించి సంబంధిత అధికారులకు అందజేశారు. ఇంటింటికీ తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మంత్ షిండే కోరారు.