వరద నీటి చేరికపై ప్రాజెక్టు అధికారులతో సమీక్ష
ఆయకట్టు పంటలకు నీటి విడుదలపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం
ఎస్సారెస్పీలో పూడిక తొలగించి, నీటి నిల్వ సామ్యార్థాన్ని పెంచుతాం.. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బాల్కొండ/మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మైనింగ్,కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి,కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు.ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని (ఇన్ ఫ్లో) పరిశీలించారు.రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు,బాలేగాం,బాబ్లీ బ్యారేజీలతో పాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికిప్పుడు వర్షాలు నిలిచిపోయినా, మరో 48 గంటల వరకు వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుందని అన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80 టీఎంసిలకు గాను, ప్రస్తుతం 1072.30 అడుగులు, 27.376 టీఎంసిల వద్ద నీరు నిలువ ఉందని తెలిపారు.
ఆయకట్టు పంటలకు రెండు మూడు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం
పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి శనివారం మధ్యాహ్నం సమయానికి 85వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి ఆయకట్టు పంటలకు ఏ మేరకు నీటిని విడుదల చేయాలని అన్న విషయమై రెండు మూడు రోజులలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అయితే, గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఎస్సారెస్పీలో ఈసారి కొంత తక్కువ మేరకే నీటి నిల్వలు ఉన్నాయని, ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. గత సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్ లో 38 టీఎంసీల నీరు నిలువ ఉండగా, ప్రస్తుతం 27 టీఎంసీలకే పరిమితం అయ్యిందన్నారు.
ఎస్సారెస్పీలో పూడిక తొలగించి, నీటి నిల్వ సామ్యస్థాన్ని పెంచుతాం
నిజానికి 112 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించబడిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక చేరడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్సారెస్పీ లో పూడిక తొలగింపు ప్రక్రియను చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయమై అతి త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులు దశాబ్దాల కాలంగా చెక్కు చెదరకుండా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నాయని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో 2019 లో నిర్మించిన మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు మాత్రం 2022 నాటికే కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆక్షేపించారు.
వీటి అవసరం లేకుండానే ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి 20 టీఎంసీ ల నీరు వచ్చి చేరిందని అన్నారు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. పై బ్యారేజీలలో నీటిని నిలువ చేసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారని, అన్ని విషయాలను శాస్త్రీయంగా, సాంకేతికపరంగా సమగ్ర పరిశీలన జరిపి మేడిగడ్డ, సుందిల్ల,అన్నారం బ్యారేజీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇటీవల ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, కేంద్ర జల సంఘం సమావేశాల్లోనూ ఏకీభవించడం జరిగిందని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతోనే ప్రజలపై ఎనలేని భారం -కార్మిక శాఖ మంత్రి వివేక్
గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ప్రజలపై ఎనలేని భారం మోపిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆక్షేపించారు.మేడిగడ్డ పంప్ హౌజ్ ల ద్వారా గత ప్రభుత్వం 60 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే ఒక్క కరెంట్ బిల్లు రూపంలోనే 3వేల కోట్ల రూపాయల ఛార్జీలు అయ్యాయని అన్నారు. పంప్ హౌజ్ ల ద్వారా నీటిని ఎత్తిపోస్తే బ్యారేజీలను ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. అసంబద్ధ నిర్ణయాలతో ప్రజాధనం వృధా చేసిన వారే, ప్రస్తుతం తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.కాగా,ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన మంత్రులకు కలెక్టర్ భవేష్ మిశ్రా, సీ.పీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఎస్సారెస్పీ సీఈ సుమతి దేవి,తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు,మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్,ఈఎన్సి రమేష్ బాబు, చీఫ్ ఇంజనీర్ సుమతి దేవి, ఈఈ లాల్ సింగ్, డిఈఈ లు సురేష్, గణేష్,సుకుమార్,రఘుపతి శ్రీనివాస్,ఏఈఈ లు కొత్త రవి, వంశీ,శ్యామ్,విన్యాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గంలోని సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
