78000 acres | ఆదిలాబాద్‌లో జొన్నకు మద్దతు ధర.. కామారెడ్డిలో రైతులకు కన్నీళ్లు!

78000 acres | ఆదిలాబాద్‌లో జొన్నకు మద్దతు ధర.. కామారెడ్డిలో రైతులకు కన్నీళ్లు!
78 వేల ఎకరాల రైతుల ఎదురుచూపులు
ఆదిలాబాద్‌కు ఓ న్యాయం.. కామారెడ్డికి మరో న్యాయమా?
ఇంచార్జీ మంత్రి సీతక్క స్పందిస్తారా?
జిల్లాల మధ్య వివక్ష?
దళారీల దయదాక్షిణ్యంపై రైతులు
రూ.289 కోట్ల నష్టం భారం
78000 acres |డోంగ్లి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో సుమారు 78 వేల ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేశారు. అంచనా ప్రకారం 1.17 లక్షల టన్నుల దిగుబడి రానుంది. కానీ రైతులకు మాత్రం ఇప్పటికీ మద్దతు ధర దక్కని పరిస్థితి నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో జొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసి, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించారు. క్యాబినెట్ సబ్‌కమిటీ కూడా రాష్ట్ర నిధులతో జొన్న కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఖరీఫ్ పనులు దగ్గరపడుతున్న వేళ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల మధ్య వివక్ష?
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ నిర్ణయం వెలువడకముందే ప్రత్యేక అనుమతులతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, క్వింటాకు రూ.3,700 మద్దతు ధర చెల్లిస్తున్నారు. అక్కడ రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దే జొన్న అమ్ముకుంటున్నారు. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 78 వేల ఎకరాల్లో జొన్న సాగు జరిగినా ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు కాలేదని రైతులు మండిపడుతున్నారు.
దళారీల దయదాక్షిణ్యంపై రైతులు..
కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దళారీలకే క్వింటాకు రూ.2,000 నుంచి రూ.2,200 ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. సరిహద్దు మండలాల రైతులు మహారాష్ట్ర మార్కెట్లకు 60–70 కిలోమీటర్ల దూరం వరకు పంట తరలించాల్సి వస్తోందని చెబుతున్నారు. రవాణా, కూలీ, కమీషన్ ఖర్చులకే క్వింటాకు మరో రూ.2,000 వరకు భారమవుతోందని రైతులు వాపోతున్నారు. “ఆదిలాబాద్ రైతుకు ఒక న్యాయం.. కామారెడ్డి రైతుకు మరో న్యాయమా? ఒకే ప్రభుత్వం, ఒకే ముఖ్యమంత్రి, ఒకే డిప్యూటీ సీఎం ఉంటే అమలులో మాత్రం ఈ వివక్ష ఎందుకు?” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రూ.289 కోట్ల నష్టం భారం! జిల్లాలో 78 వేల ఎకరాల్లో సాగైన జొన్నకు 1.17 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ రూ.3,700 బదులు రైతులకు కేవలం రూ.2,000 మాత్రమే లభిస్తుండటంతో క్వింటాకు రూ.1,700 నష్టం వస్తోంది. ఈ లెక్కన కామారెడ్డి జిల్లా రైతులకు మొత్తం సుమారు రూ.289 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి.

సీతక్క జోక్యం చేసుకుంటారా?
కామారెడ్డి జిల్లా ఇంచార్జీ మంత్రిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఉన్నారు. జిల్లాలో జొన్న సాగు చేసే వారిలో అధిక సంఖ్యలో సన్నకారు రైతులే ఉన్నారు. “సీతక్కమ్మ పేదల పక్షాన నిలబడే నాయకురాలు. అలాంటి ఆమె జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరని ఆశిస్తున్నాం. ఆదిలాబాద్ ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నం కామారెడ్డి ప్రజాప్రతినిధులు ఎందుకు చేయలేకపోతున్నారు?” అని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో జొన్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా మండలాల వారీగా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఆదిలాబాద్ తరహాలోనే క్వింటాకు రూ.3,700 మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంచార్జీ మంత్రి సీతక్క చొరవ తీసుకుని 48 గంటల్లో కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. “ఒకే రాష్ట్రం… ఒకే పాలసీ… మరి అమలులో మాత్రం రెండు రకాల న్యాయమా?” అంటూ 78 వేల ఎకరాల కామారెడ్డి జొన్న రైతుల కన్నీళ్లు తుడిచే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపైనే ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు.

