భవన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహిద్దాం..

  • రీసైక్లింగ్‌తో పర్యావరణ పరిరక్షణ సాధ్యం
  • నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై అధికారులకు శిక్షణ

కర్నూలు, ఆంధ్రప్రభ : పట్టణాల్లో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు వ్యర్థాలను తిరిగి వినియోగించే విలువైన వనరులుగా మార్చవచ్చని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సెంటర్ డైరెక్టర్, రిటైర్డ్ సీనియర్ అధికారి డా. బి. జానర్ధన్ రెడ్డి అన్నారు.

శనివారం నగరంలోని ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ సమావేశ భవనంలో కర్నూలు నగరపాలక సంస్థ మరియు ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో “నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ” అంశంపై ఒకరోజు నాయకత్వ శిక్షణా సదస్సు నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఎల్‌టీపీలు, మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులు, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

నిబంధనల అమలుకు సమన్వయం అవసరం

ప్రధాన వక్తగా పాల్గొన్న డా. జానర్ధన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2025ను సమర్థవంతంగా అమలు చేయాలంటే మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, అకౌంట్స్, ప్రొక్యూర్‌మెంట్ విభాగాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

వ్యర్థాలను వనరులుగా మలచాలి..

నిర్మాణ పనులు, భవనాల కూల్చివేత వల్ల వెలువడే కాంక్రీట్, ఇటుకలు, ఇసుక, రాళ్లు, ఇనుము తదితర వ్యర్థాలను రోడ్లు, కాల్వలు, చెరువులు, ఖాళీ స్థలాల్లో వేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ వ్యర్థాలను మూలం వద్దనే వేరు చేసి, శాస్త్రీయంగా సేకరించి, రవాణా చేసి, ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించి రీసైక్లింగ్ చేయడం ద్వారా తిరిగి నిర్మాణ రంగంలో వినియోగించవచ్చని వివరించారు. ఇలా చేయడం వల్ల సహజ వనరుల వినియోగం తగ్గడమే కాకుండా, సర్క్యులర్ ఎకానమీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

అందరి బాధ్యతే..

నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో ప్రజలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు సమాన బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎక్కడపడితే అక్కడ నిర్మాణ వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థ సూచించిన నిబంధనలను పాటించాలని కోరారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాలంటే నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనన్నారు.

పటిష్ట కార్యాచరణతో ముందుకు..

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, కర్నూలులో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యర్థాల శాస్త్రీయ సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి పరిశుభ్రమైన, పర్యావరణహిత కర్నూలు నగర నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.

అధికారులకు ప్రత్యేక శిక్షణ..

శిక్షణా సదస్సులో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2025, వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సాంకేతికతలు, నగర స్థాయి అమలు వ్యూహాలు, ఆర్థిక నిర్వహణ, ఉత్తమ విధానాలపై అధికారులు, సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న నమూనాలను వివరించి, వాటిని కర్నూలు నగర పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆస్కీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అంకూర్ పరాషర్, జీహెచ్‌ఎంసీ రిటైర్డ్ ఎస్‌ఈ కోటేశ్వరరావు, పాలసీ అండ్ స్ట్రాటజీ నిపుణుడు శ్యాం రాథోడ్, ఎస్‌ఎస్‌ఆర్‌సీ డైరెక్టర్ రఘు బెజవాడ, రెండో పోలీస్ పటాలం అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఏసీపీ నాగరాజు, అకౌంట్స్ ఆఫీసర్ రఘునందన్, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్ తదితరులు పాల్గొన్నారు.