ఇంద్రకీలాద్రిపై రేపు విఐపీ దర్శనాలకు విరామం…

ఆషాఢ ఉత్సవాల రద్దీ దృష్ట్యా నిర్ణయం
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేత
ప్రైవేట్ వాహనాల ప్రవేశంపై నియంత్రణ..
దేవస్థానం బస్సులే ప్రధాన రవాణా
వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు రద్దీ లేని వేళల్లో రావాలి
ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి


( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు (ఆదివారం) ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ప్రోటోకాల్, విఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు వస్తున్నట్లు సమాచారం అందిందని, గత ఆదివారాల్లో కూడా ఆలయంలో అధిక రద్దీ నమోదైనందున సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని, దేవస్థానం ప్రత్యేక బస్సులను పూర్తిస్థాయిలో నడుపుతామని వెల్లడించారు. లిఫ్ట్ మార్గాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తామని, మహామండపం ర్యాంపు మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకోవాలని సూచించారు.

వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డలతో వచ్చే తల్లులు ఉదయం 8 గంటలలోపు లేదా సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య రద్దీ తక్కువగా ఉండే సమయంలో దర్శనానికి రావాలని ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ దేవస్థానం అధికారులు చేపడుతున్న ఏర్పాట్లకు సహకరించి అమ్మవారి దర్శనాన్ని సజావుగా పూర్తి చేసుకోవాలని కోరారు.