Secunderabad Railway Station | ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్
Secunderabad Railway Station | ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్
Secunderabad Railway Station | రూ.714.73 కోట్లతో పునర్నిర్మాణ పనులు
ప్రయాణికుల సౌలభ్యం కోసం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు
స్కైవాక్‌లతో మెట్రో కనెక్టివిటీకి మార్గం
ఈవీ ఛార్జింగ్, సీసీటీవీ భద్రతతో ఆధునిక సదుపాయాలు
ప్రపంచ స్థాయి రవాణా హబ్‌గా ముస్తాబవుతున్న స్టేషన్
పురోగతి వివరాలు పంచుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Secunderabad Railway Station | హైదరాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మందికి చిరపరిచితం. మొత్తం 10 ప్లాట్‌ఫామ్స్, 11 ట్రాక్స్ ఉన్న ఈ స్టేషన్ నుంచి నిత్యం 180 రైళ్లు దేశం నలుమూలలకూ రాకపోకలు సాగిస్తున్నాయి. రోజూ సగటున లక్షన్నర మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే జోన్లలో ఒకటిగా ఉండే దక్షిణ మధ్య రైల్వేకు ఇది కేంద్ర బిందువు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు విస్తరించిన ఈ అతిపెద్ద జోన్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయం ఉండేది సికింద్రాబాద్‌లోనే. వందే భారత్, రాజధాని, శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి.
పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్‌ఫామ్ల సంఖ్యకు అనుగుణంగా దీన్ని మరింత విస్తరిస్తున్నారు. ఆధునికీకరిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని అత్యద్భుతంగా రూపుదిద్దుతోంది.
రూ.714.73 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం
తెలంగాణలో సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజిగిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట జంక్షన్, మధిర వంటి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని స్టేషన్ల పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు రూ.714.73 కోట్ల వ్యయంతో కొనసాగుతున్నాయి. మూడు దశల్లో పూర్తి కానున్నాయి. వచ్చే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ నిర్మితమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇందులో 64 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ అభివృద్ధిలో భాగంగా నూతన ప్రతిష్టాత్మక స్టేషన్ భవనాలు, రెండు స్థాయిల ఎయిర్ కాన్‌కోర్స్, ప్లాట్‌ఫారాలపై కవర్ రూఫ్, మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ప్రధాన సౌకర్యాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. స్కైవాక్‌ల ద్వారా మెట్రో కనెక్టివిటీ, ఆధునిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్లాంట్, ఈవీ ఛార్జింగ్ వసతులు, సమగ్ర సీసీటీవీ భద్రతా వ్యవస్థలు కూడా అంతర్భాగం.
ప్రాజెక్టులో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, రైల్వే రక్షణ దళ భవనం, పాదచారుల వంతెనల నిర్మాణం, దక్షిణ వైపు అప్రోచ్ రోడ్డు వంటి కొన్ని పనులు పూర్తయ్యాయి. నూతన స్టేషన్ భవనాలు, ఎయిర్ కాన్‌కోర్స్, బహుళ స్థాయి పార్కింగ్, భూగర్భ నీటి ట్యాంకులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ సహా అనేక కీలక పనులు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. మెట్రో స్టేషన్లను కలిపే స్కైవాక్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.
ఎక్స్‌రే చిత్రాలు పంచుకున్న కిషన్‌రెడ్డి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి రవాణా హబ్‌గా ముస్తాబవుతోంది. సకల సౌకర్యాలతో, అత్యంత ఆకర్షణీయంగా పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణకు ఇది ఆధునిక రైల్వే గేట్‌వే అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పురోగతి పనుల చిత్రాలు, వివరాలను బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
విశాలమైన ప్రవేశద్వారాలు, సకల సౌకర్యాలతో వేచి ఉండే గదులు, ఎయిర్ కాన్‌కోర్స్ నిర్మాణం చివరి దశకు వచ్చింది. ప్రయాణికులు, వాహనదారుల కోసం మల్టీ లెవెల్ పార్కింగ్ సిద్ధమవుతోంది. 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లతో స్టేషన్ విమానాశ్రయాన్ని తలపిస్తోంది.
మెట్రో స్టేషన్‌తో అనుసంధానించేలా స్కైవాక్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది. పర్యావరణానికి పెద్దపీట వేసేలా ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. భద్రతలో భాగంగా అధునాతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భవనం, స్టేషన్ దక్షిణం వైపు అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
