Telangana Degree Courses | ప్రైవేట్ వర్సిటీల లాభం కోసం పావులు కదిలాయా?
Telangana Degree Courses | ప్రైవేట్ వర్సిటీల లాభం కోసం పావులు కదిలాయా?
Telangana Degree Courses | గ్రామీణ విద్యార్థుల కోసం 11 ఉపాధి ఆధారిత కోర్సులు
కొత్త కోర్సులపై బ్యూరోక్రాట్ల అడ్డంకుల ఆరోపణలు
68 కళాశాలలకు అనుమతులు లభించినా దోస్త్‌లో ఆలస్యం
ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ మధ్య తారాస్థాయి విభేదాలు
బీఓఎస్ మినిట్స్‌తో మరింత జఠిలమైన కోర్సుల వ్యవహారం
Telangana Degree Courses | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి 11 అధునాతన, ఉపాధి ఆధారిత డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులు అమల్లోకి వస్తే తమ బండారం బయటపడుతుందన్న ఉద్దేశ్యంతో విద్యాశాఖలోని కీలకమైన బ్యూరోక్రాట్లు అడ్డుకున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.
అచ్చంగా ఇవే కోర్సులను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు ప్రైవేట్ వర్సిటీలు ప్రవేశపెట్టి విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా, ప్రభుత్వంలోని పెద్దలు కిమ్మనకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తాము ప్రవేశపెట్టిన కొత్త కోర్సుల్లో భారీ ఎత్తున విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రైవేట్ వర్సిటీలు వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. అయినా ఉన్నత విద్యా మండలి అనుమతి మంజూరు చేసిన కోర్సుల విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కోర్సుల అనుమతి విషయంలో ఇప్పటి దాకా సమాయత్తమవుతున్నారు.
ఆమెవి మోనార్క్ నిర్ణయాలు
ఉన్నతాధికారిణి అడ్డు పడకపోయి ఉంటే, ఇప్పటికే దోస్త్ ప్రవేశాల్లో కొత్త కోర్సుల సీట్లు హాట్‌కేకుల్లా భర్తీ అయ్యేవని విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రైవేట్ వర్సిటీల యాజమాన్యాలు సచివాలయం కేంద్రంగా పెద్ద ఎత్తున పావులు కదిపి ఈ కోర్సులను అడ్డుకున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు సైతం చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని పేరెన్నికగన్న వర్సిటీల వీసీల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
ప్రైవేట్ వర్సిటీలకు లాభం చేకూర్చేందుకే ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నత విద్యా మండలి ప్రవేశపెట్టిన కోర్సులను అడ్డుకున్నారని, అందులో వారు అనుకున్నది సాధించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అంచనాలు సిద్ధం చేశారు. వివిధ రంగాల ప్రముఖులతో ఆరు మాసాల పాటు సుదీర్ఘ సమాలోచనలు జరిపిన తర్వాత ఏవియేషన్, డిఫెన్స్, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం, ఈ-కామర్స్, బ్యాంకింగ్, టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, ఎం-కామర్స్, జీవిత బీమా రంగాల్లో 11 నూతన కోర్సులకు రూపకల్పన చేశారు.
వాటికి అవసరమైన అనుమతుల కోసం నోటిఫికేషన్ జారీ చేసి, కళాశాలల యాజమాన్యాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అందుకు 100కు పైగా విద్యా సంస్థలు దరఖాస్తు చేసుకోగా, నిబంధనలకు అనుగుణంగా ఉన్న 68 కళాశాలల్లో ఈ కోర్సులకు అనుమతులు లభించాయి. రాష్ట్రంలోని ఆరు వర్సిటీలకు సంబంధించిన బోర్డు ఆఫ్ స్టడీస్ బీఓఎస్ను అడ్డం పెట్టుకుని విద్యాశాఖలోని ఒక ఉన్నతాధికారి ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీని అడ్డుకున్నారు.
కోర్సుల వివరాలను దోస్త్ వెబ్ పోర్టల్‌లో పెట్టనివ్వకుండా అడ్డుకున్నట్టు ఆరోపణలున్నాయి. కొత్త కోర్సుల అవసరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాజ్యసభ సభ్యుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావులను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వేర్వేరుగా కలిసి వివరించినా ఫలితం లేకపోయింది. చివరికి వారు కూడా సివిల్ సర్వెంట్లు చెప్పిందే వేదంగా పరిగణించడంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కొత్త కోర్సుల వ్యవహారంలో విద్యాశాఖలో తారాస్థాయికి విభేదాలు చేరుకున్నాయి.
తారాస్థాయికి విభేదాలు
కొత్త కోర్సుల అనుమతుల విషయమై ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్య కమిషనర్ దేవసేన మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. తాము ప్రవేశపెట్టిన డిగ్రీ కోర్సులకు వర్సిటీల బోర్డు ఆఫ్ స్టడీస్ అనుమతి లేదని దేవసేన ఆరోపించడంతో, ఆయా వర్సిటీల ఉపకులపతులు సమావేశం నిర్వహించి ఉన్నత విద్యా మండలి ఇచ్చిన కొత్త కోర్సులను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆయా వర్సిటీలు పంపించిన బీఓఎస్ సమావేశాల మినిట్స్ ప్రతులను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు అందజేశారు. ఈ మినిట్స్‌కు సమాధానం ఇవ్వాలని యోగితా రాణా, దేవసేనను కోరడంతో కొత్త కోర్సుల వ్యవహారం మరింత జఠిలమయ్యేలా ఉంది. మరోవైపు వర్సిటీల ఉపకులపతులకు దేవసేన ఫోన్లు చేసి, ఉన్నత విద్యా మండలి ఇచ్చిన కొత్త కోర్సులను బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశంలో ఎలా ఆమోదించారని ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది.
