El Nino Impact | పంట దిగుబడులు తగ్గే ప్రమాదం

El Nino Impact | పంట దిగుబడులు తగ్గే ప్రమాదం

El Nino Impact | నైరుతి వచ్చినా రైతుల్లో ఎల్‌నినో భయం
తగ్గిన భూగర్భ జలాలతో సాగుకు సవాలు
సూపర్ ఎల్‌నినోతో వర్షపాతంపై ప్రభావం
దారి తప్పనున్న రుతుపవనాలు
సెప్టెంబర్‌లో అన్నదాతలకు కీలక పరీక్ష
తక్కువ నీటితో పండే పంటలపై నిపుణుల సూచన

El Nino Impact | హైదరాబాద్, ఆంధ్రప్రభ: నైరుతి ఆగమనం ఒకింత ఊరట కలిగిస్తున్నా… ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు సాగుకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చన్న భయం అందరిలోనూ వెంటాడుతోంది. ప్రధానంగా పొంచి ఉన్న ఎల్‌నినో రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఎల్‌నినో వల్ల ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. గత వానాకాలం సీజన్‌లో 9 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు.. రబీ సీజన్‌లో దాదాపు 16 మీటర్ల లోతుకు పడిపోయి… ప్రమాదకర పరిస్థితులు దాపురించాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎల్‌నినో భయాలు రాష్ట్ర సర్కారును వెంటాడుతున్నాయి.

ఇప్పటికీ తెలంగాణలో 70 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉపాధి పొందుతోంది. దీనిపై అప్రమత్తమైన సీఎం రేవంత్‌రెడ్డి వానాకాలం సన్నద్ధతపై ప్రత్యేకంగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా రూ.1000 కోట్లను కేటాయించారు.

ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో అభివృద్ధి చెందుతున్న ఎల్‌నినో వాతావరణ వ్యవస్థ సాధారణ వర్షపాత విధానాన్ని తీవ్రంగా దెబ్బతీయనుందని, దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కరువును, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలను తెచ్చే అవకాశం ఉందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదించింది. అందుకే దీన్ని **‘సూపర్ ఎల్‌నినో’**గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అదే జరిగితే పంట దిగుబడులు భారీగా తగ్గి రైతులకు నష్టం వాటిల్లడంతో పాటు వివిధ ఆహార పదార్థాల ధరలు మండిపోయే అవకాశం ఉందని, దాంతో సామాన్యుడిపై ధరల పిడుగు పడడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

దారి తప్పనున్న రుతుపవనాలు

ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్నే శాస్త్రవేత్తలు ఎల్‌నినోగా పేర్కొంటున్నారు. దీనివల్ల గాలి వీచే దిశలు మారిపోయి, మన దేశం వైపు రావాల్సిన రుతుపవనాలు దారి తప్పుతాయి. ఫలితంగా దేశంలో, రాష్ట్రంలో కురవాల్సిన వర్షాలు పసిఫిక్ సముద్రం వైపు వెళ్లిపోతాయి. దీనివల్ల కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.

సెప్టెంబర్ నెల వచ్చేసరికి తీవ్ర రూపం దాల్చుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాగులో కీలకమైన సెప్టెంబర్ నెలలోనే ఈ ప్రభావం ఉండనుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలోనే వరి, పత్తి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు గింజ కట్టే దశకు వస్తాయి. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలవైపు దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.