AP DSC Sports Quota | డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై వివాదాల నీలినీడలు

AP DSC Sports Quota | డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై వివాదాల నీలినీడలు

AP DSC Sports Quota | మెరిట్ ఆధారంగా క్రీడా కోటా ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ విధానంలో పారదర్శక దరఖాస్తు ప్రక్రియ
క్రీడా సంఘాల సర్టిఫికెట్లకే ప్రామాణికత
బహుళస్థాయి కమిటీలతో సర్టిఫికెట్ల పరిశీలన
క్రీడా స్థాయికి అనుగుణంగా వెయిటేజీ విధానం
ధ్రువీకరణ, పర్యవేక్షణకే శాప్ బాధ్యత
అవగాహన పెరిగితే వివాదాలకు ముగింపు

AP DSC Sports Quota | అమరావతి, ఆంధ్రప్రభ: ఉద్యోగాల నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వివాదాలు ముసురుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ పోస్టుల భర్తీలో క్రీడా కోటాలో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం విదితమే. అయితే ప్రతిభే ఆధారంగా ఎంతో పారదర్శకంగా చేపట్టే క్రీడా కోటాపై పూర్తి అసత్య ఆరోపణలు వస్తుండడంతో ఈ కోటాపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక విధానం స్పష్టత.. అర్హతలు, సర్టిఫికెట్ల వెయిటేజీ తదితర అంశాలపై అవగాహన కోసం ఆంధ్రప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం.

డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో క్రీడా కోటా కింద ఎంపిక చేసే అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నిబంధన ప్రకారం క్రీడా కోటా కింద నియామక ప్రక్రియ అంతా పూర్తి మెరిట్ ఆధారంగానే, బహుళస్థాయి ధ్రువీకరణ వ్యవస్థ ద్వారా పారదర్శకంగానే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

అంతా ఆన్‌లైన్ విధానం

ఈ కోటా కింద దరఖాస్తు చేసుకొనే ప్రాథమిక దశ నుంచే పూర్తి స్థాయి పారదర్శకత ఉండేలా ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు క్రీడా వివరాలను అధికారిక పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ దశలో సమర్పించిన సమాచారాన్ని వివిధ దశల్లో ఆయా రంగాలకు చెందిన నిపుణులు పరిశీలిస్తారు.

• స్పోర్ట్స్ కోటా ఎంపికలో ఫెడరేషన్లే కీలకం
• క్రీడా సంఘాల సర్టిఫికెట్లే ప్రామాణికం
• ధ్రువీకరణకే శాప్ పరిమితం
• మెగా డీఎస్సీ నియామకాలపై వివాదం
• క్రీడా కోటాపై అనవసర రాద్ధాంతం

అసలు ఆ అభ్యర్థి క్రీడాకారుడా కాదా అనే అంశంలో, ఆ అభ్యర్థి సంబంధిత క్రీడలో ప్రావీణ్యం పొందినట్లు గుర్తించి క్రీడా సంఘాలు ఇచ్చే సర్టిఫికెట్ ప్రామాణికంగా నిలుస్తోంది. ఈ కోటాలో ఉద్యోగాల భర్తీకి కీలకంగా క్రీడా సర్టిఫికెట్లు నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీటిని స్పోర్ట్స్ అథారిటీ జారీ చేయదు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఫెడరేషన్లు, యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు మాత్రమే క్రీడాకారులకు అందజేస్తాయి. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే అభ్యర్థి క్రీడా ప్రతిభను నిర్ధారిస్తారు.

వివిధ స్థాయిల్లో పరిశీలన

అభ్యర్థులు సమర్పించిన క్రీడా సర్టిఫికెట్లను వివిధ స్థాయిల్లో పరిశీలిస్తారు. ఐఏఎస్ అధికారుల కమిటీలు, విద్యాశాఖ, క్రీడాశాఖ ప్రతినిధులు ధ్రువీకరణ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తారు. అభ్యర్థికి జారీ చేసిన క్రీడా సర్టిఫికెట్ ఇచ్చిన ఫెడరేషన్ గుర్తింపు ఏమిటి? ఏ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించాడు? ఆయా పోటీల ప్రామాణికత ఏమిటి? తదితర అంశాలను నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుంది.

వెయిటేజీ విధానం

స్పోర్ట్స్ కోటా ఎంపికలో క్రీడా స్థాయికి అనుగుణంగా వెయిటేజీ నిర్ణయిస్తారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత జాతీయ స్థాయి వారికి అవకాశం లభిస్తోంది. చివరగా రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు తక్కువ స్థాయి వెయిటేజీ ఉంటుంది. క్రీడల్లో ఆయా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే వెయిటేజీ, ఎంపిక విధానం కూడా అమలవుతోందని అధికారులు చెబుతున్నారు.

ధ్రువీకరణకే శాప్ పరిమితం

ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ శాప్కు కేవలం అభ్యర్థులు సమర్పించిన క్రీడా సర్టిఫికెట్లను ధ్రువీకరించే అధికారం మాత్రమే ఉంటుంది. ఈ సంస్థ నేరుగా క్రీడాకారులకు సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం ఉండదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. శాప్ కేవలం ధ్రువీకరణ, సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను మాత్రమే చేపడుతోంది. సర్టిఫికెట్ల విలువ జారీ చేసే ఫెడరేషన్లపై ఆధారపడి ఉంటుంది.

అవగాహనతోనే వివాదాలు దూరం

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలను ప్రభుత్వం ఒక నిర్దిష్ట విధాన పద్ధతిలో చేపడుతోంది. ఇందులో వ్యక్తిగత ప్రభావానికి అవకాశం లేకుండా బహుళస్థాయి కమిటీలు, అధికారిక ధ్రువీకరణ వ్యవస్థలను భాగస్వామ్యం చేస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ వ్యవస్థపై అవగాహన పెరిగితే వివాదాలకు ముగింపు పలికే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.