సూర్యప్రకాశ్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం

స్వయంగా ఇంటికి వెళ్లి అందజేసిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, ఆంధ్రప్రభ : ఇటీవల ఫుడ్ కోర్టులో జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన 18వ డివిజన్‌కు చెందిన పందిటి సూర్యప్రకాశ్ కుటుంబ సభ్యులను సోమవారం గద్దె క్రాంతి కుమార్ రాణిగారితోటలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సూర్యప్రకాశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూర్యప్రకాష్ తండ్రి మురళికి లక్ష రూపాయల నగదును అందించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన సూర్యప్రకాశ్ అకాల మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సూచనల మేరకు సొంత నిధుల నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున కూడా తగిన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబానికి పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇటువంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ జీవిత బీమా (ఇన్సూరెన్స్) తీసుకోవడం అవసరమని సూచించారు. ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలకు కొంతైనా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొక్కెర తిరుపతయ్య, మైలామూరి ఫీరుబాబు, గొర్రిపర్తి నామేశ్వరరావు, తలపాటి ప్రసాద్, పగడాల వెంకటేశ్వర రెడ్డి, బలగాని శ్రీను, గోగుల ఏసుబాబు, అంబటి కాశీ, అంబడిపూడి దుర్గమ్మ, రెడ్డి మాలక్ష్మమ్మ, గోగుల గోపి, పత్తి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply