MLA Raja Singh | కార్యకర్తల గుండె మండుతోంది..
టీజీ బీజేపీలో విభేదాలపై రాజాసింగ్ ఫైర్
నేతల మధ్య ఈగోలతో పార్టీకి నష్టం జరుగుతోందని వ్యాఖ్య
క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకుండా విజయాలు సాధించడం సాధ్యం కాదన్న ఎమ్మెల్యే
MLA Raja Singh | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ బీజేపీలో అంతర్గత పరిణామాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని, అయితే కేవలం నేతల మధ్య రాజీ కుదిరితేనే తెలంగాణలో అధికారంలోకి రావడం సాధ్యం కాదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకుండా, కేవలం ఎన్నికల సమయంలో విజయాలపై ఆశలు పెట్టుకోవడం పగటికలగానే మిగిలిపోతుందని అన్నారు. కొంతమంది నేతల వ్యక్తిగత ప్రతిష్ట, ఈగోల కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని రాజాసింగ్ ఆరోపించారు. దీనివల్ల కష్టపడుతున్న కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తల సమస్యలు, పార్టీ అంతర్గత పరిణామాలపై అధిష్ఠానం దృష్టి సారించాలని సూచించారు.
