ఎస్సీ వర్గాల సమస్యలపై కమిషన్ ప్రత్యేక దృష్టి!
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: షెడ్యూల్డ్ కులాల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడమే రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ తెలిపారు.
మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్, కమిషన్ సభ్యులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి ఎస్. చిన్నరాముడు, సభ్యులు మేకల భిక్షం, డా. పి. గౌతంరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కమిషన్ స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటోందన్నారు. కమిషన్ పర్యటనల సమాచారం ప్రజలకు మరింత విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోల్చితే అట్రాసిటీ కేసుల సంఖ్య తక్కువగా ఉండటం సానుకూల అంశమన్నారు. కమిషన్ వద్ద ఉన్న వివరాల ప్రకారం జిల్లాలో 53 అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 11 కేసులపై ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన 42 కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
అట్రాసిటీ కేసుల నియంత్రణలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను అభినందించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు, నిందితులకు సకాలంలో శిక్షలు పడేలా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.
షెడ్యూల్డ్ కులాలపై వివక్ష, వేధింపులు, అట్రాసిటీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాబోయే రెండేళ్లలో కర్నూలు, నంద్యాల జిల్లాలను “అట్రాసిటీ ఫ్రీ జోన్”లుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజల వినతులు
గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన జి. రాజు తమ కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల భూమిని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పరిశ్రమకు ఇచ్చామని, భూమి ఇచ్చిన సందర్భంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
అదే గ్రామానికి చెందిన ఈ. రాజు సర్వే నంబర్ 260లో తనకు చెందిన ఒక ఎకరం భూమిని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం ఆక్రమించుకుందని ఆరోపిస్తూ, తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మిడ్తూరు మండలం సంకేసుల గ్రామానికి చెందిన ఎం. జయరాముడు తాను ఎలాంటి ఉద్యోగం లేదా వ్యాపారం చేయడం లేదని, ఆదాయపు పన్ను కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ హౌస్ మ్యాపింగ్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుడిగా నమోదు కావడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందడం లేదని తెలిపారు. సంబంధిత వివరాలను సరిచేసి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.
