గతి తప్పిన పోష్.. మహిళా ఉద్యోగినుల భద్రతపై ప్రశ్నలు

గతి తప్పిన పోష్.. మహిళా ఉద్యోగినుల భద్రతపై ప్రశ్నలు

  • హైదరాబాద్ ఐటీ సంస్థల్లో మహిళల భద్రత ఆందోళనకరం
  • 88 శాతం సంస్థల్లో పోష్ చట్టం అమలులో నిర్లక్ష్యం
  • అంతర్గత ఫిర్యాదుల కమిటీల కొరతపై కార్మిక శాఖ ఆందోళన
  • హైకోర్టు కీలక సూచనలు.. పోష్ కమిటీల ఏర్పాటు తప్పనిసరి
  • భయంలేకుండా ఫిర్యాదు చేసే వాతావరణమే పరిష్కారం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : వెలుగులతో మెరిసిపోయే భవనాలు.. వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన హైదరాబాద్ ఐటీ కారిడార్లో మహిళా ఉద్యోగినుల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. ఆధునిక కార్యాలయాల వెనుక ఉద్యోగినులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ నిర్వహించిన పరిశీలనలో 12 శాతం సంస్థల్లో మాత్రమే అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) ఉన్నట్లు తేలడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది.

నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న యువతి తన సహోద్యోగి నుంచి ఎదురైన అసభ్య వ్యాఖ్యలు, వెకిలి చేష్టలతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. కార్యాలయంలో జరిగిన ఈ వేధింపులను తట్టుకోలేక స్నేహితురాలి వద్ద తన బాధను వ్యక్తం చేసింది. ఆమె చొరవతో షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. అయితే, ప్రతి బాధితురాలికి ఇలాంటి సహాయం అందడం లేదని మహిళా సంఘాలు చెబుతున్నాయి.

పోష్ చట్టం అమలులో నిర్లక్ష్యం

మహిళలకు సురక్షితమైన కార్యాలయ వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో పోష్ (Prevention of Sexual Harassment) చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయాలి. బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, నిర్దిష్ట కాలవ్యవధిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడం ఈ కమిటీ బాధ్యత.

అయితే తెలంగాణలోని 88 శాతం సంస్థలు ఈ నిబంధనలను పాటించడం లేదని కార్మిక శాఖ పరిశీలనలో తేలింది.

హైకోర్టు కీలక సూచనలు

కార్యాలయాల్లో మహిళలపై జరిగే వేధింపులకు సంబంధించిన కేసులపై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి వివాదాలు ముందుగా సంబంధిత సంస్థలోని అంతర్గత వ్యవస్థ ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పోష్ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీలను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని ధర్మాసనం సూచించింది. ప్రతి సంస్థలో కమిటీల ఏర్పాటు తప్పనిసరి అని మరోసారి గుర్తు చేసింది.

మహిళలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం షీ-బాక్స్ అనే ఆన్‌లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చినా, ఆశించిన స్థాయిలో వినియోగంలోకి రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

షీ టీమ్స్ సేవలు కొనసాగుతున్నా…

బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 86 షీ టీమ్స్లో 375 మంది సిబ్బంది పని చేస్తున్నారు. 2025 జూన్ నుంచి 2026 జూన్ వరకు 993 కేసులు నమోదుకాగా, 6,855 ఫిర్యాదులు అందాయి. ఈ కాలంలో 983 మందిపై ప్రత్యక్ష చర్యలు తీసుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అయితే, రోడ్లపై నిఘా పెరిగినా, కార్యాలయాల్లో జరిగే వేధింపులను అరికట్టడంలో వ్యవస్థ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫిర్యాదుల వెల్లువ

ఐటీ రంగంలోని మహిళా ఉద్యోగుల సమస్యలను వినేందుకు ఈ ఏడాది మేలో ప్రారంభించిన ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ అనే ఆన్‌లైన్ వేదికకు ప్రారంభమైన రెండు వారాల్లోనే వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఇప్పటికీ ఫిర్యాదులు కొనసాగుతుండటం కార్యాలయాల్లో మహిళల భద్రతపై ఉన్న ఆందోళనను స్పష్టం చేస్తోంది.

పోష్ చట్టాన్ని ప్రతి సంస్థలో కచ్చితంగా అమలు చేయడం, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటును తప్పనిసరి చేయడం, వాటి పనితీరును కార్మిక శాఖ, ఐటీ శాఖలు క్రమం తప్పకుండా పర్యవేక్షించడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేసే వాతావరణం కల్పించినప్పుడే కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.