గోదావరి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు..
కడెం ప్రాజెక్టులోకి పెరుగనున్న నీటిమట్టం..

జన్నారం, కడెం (ఆంధ్రప్రభ): భారీ వర్షాల కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు, ఇతరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు చేరి నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుకు వరద నీరు వదలడానికి 18 గేట్లు ఉండగా, సాగునీరు వదలడానికి కుడి, ఎడమ ప్రధాన కాలువలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 684.525 అడుగుల వద్ద నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.933 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఆయకట్టు 68,150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆయకట్టు కింద రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు.

నీటిపారుదల శాఖ అధికారుల వివరాల ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్టులోకి 12,259 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే కుడి, ఎడమ ప్రధాన కాలువలను మూసి ఉంచారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 67 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇందులో మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు, ఇతర నష్టాల రూపంలో 58 క్యూసెక్కులు వెళ్తుండగా, వరద నీటి విడుదల (సర్‌ప్లస్ డిశ్చార్జ్) లేదు. ప్రస్తుతం 18 గేట్లలో ఏ ఒక్క గేటును కూడా ఎత్తలేదు.

ఈ ప్రాజెక్టు సాగునీరు నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తూరాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల రైతుల పంట పొలాలకు అందుతోంది.

ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రానున్న గంటల్లో వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

అందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఈ విషయమై కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు డివిజన్-4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్‌ను బుధవారం ఉదయం సంప్రదించగా, అవసరమైతే ఎప్పుడైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశముందని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిపారుదల శాఖ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.