భారీ వర్షానికి కొట్టుకుపోయిన వంతెన.. రెండు గ్రామాలకు రాకపోకలు బంద్

కడెం (ఆంధ్రప్రభ): నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని కుర్రగూడ, పాత రేవుజిపేట్ గ్రామాల మధ్య ఉన్న అప్రోచ్ వంతెన భారీ వర్షాల ధాటికి కొట్టుకుపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉద్ధృతి పెరగడంతో గ్రామస్తులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన కూడా కొట్టుకుపోయింది.

మూడేళ్ల క్రితం వరదల్లో అసలు వంతెన దెబ్బతినడంతో గ్రామస్తులే తాత్కాలిక అప్రోచ్ వంతెన ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా అది కూడా కొట్టుకుపోవడంతో కుర్రగూడ, పాత రేవుజిపేట్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన గ్రామాలకు శాశ్వత పరిష్కారంగా వెంటనే కొత్త వంతెన నిర్మించి రాకపోకలు పునరుద్ధరించాలని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.