భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి…
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన
- సహాయం కోసం వెంటనే డయల్-100కు కాల్ చేయాలని విజ్ఞప్తి
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే నీరు నిలిచిన రహదారులపై వాహనాలతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
వాహనాలను నెమ్మదిగా, అప్రమత్తంగా నడపడంతో పాటు ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని, ట్రాఫిక్ విభాగం అధికారిక సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విడుదల చేసే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే డయల్-100కు కాల్ చేయాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని సీపీ వెల్లడించారు.
