వెంటిలేటర్‌పై పెద్ది సుదర్శన్ రెడ్డి..

  • పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం
  • వెంటిలేటర్‌పై చికిత్స.. 72 గంటల తర్వాతే స్పష్టత

హైదరాబాద్, ఆంధ్రప్రభ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు.

గుండెపోటు రావడంతో హనుమకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలించిన ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గుండెపోటు సమయంలో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అనాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ ఏర్పడిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం శ్వాసక్రియ వ్యవస్థ స్థిరంగానే ఉన్నప్పటికీ, ఆయన ఇంకా స్పృహలోకి రాలేదని, మాటలకు గానీ, నొప్పికి గానీ ఎలాంటి స్పందన చూపడం లేదని వెల్లడించారు. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల పాటు న్యూరోలాజికల్ రీ-అసెస్‌మెంట్ నిర్వహించిన అనంతరమే ఆయన ఆరోగ్య పరిస్థితి, కోలుకునే అవకాశాలపై స్పష్టమైన అంచనాకు రావచ్చని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.