సాకిన ఎద్దే ప్రాణం మీదికి తెచ్చింది..

రాయపర్తి (ఆంధ్రప్రభ): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా (సన్నూరు) గ్రామంలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏళ్లుగా సాకుతున్న ఎద్దే ఓ వృద్ధుడిపై ఆకస్మికంగా విరుచుకుపడడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రైతుకు జీవనాధారమైన పశువే ప్రాణాపాయ స్థితికి నెట్టిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గ్రామానికి చెందిన గుగులోతు మను ఉదయం ఎడ్లను పొలం వద్దకు తోలుకెళ్తుండగా, వాటిలో ఒక ఎద్దు అకస్మాత్తుగా విరుచుకుపడింది. ఎద్దు కొమ్ము ఆయన కడుపులో బలంగా గుచ్చుకోవడంతో పేగులు బయటకు వచ్చాయి. రక్తపు మడుగులో పడిపోయిన మను ఆర్తనాదాలు విని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతుండగా, త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.