జెన్-జీ అస్త్రంతో తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహం

జెన్-జీ అస్త్రంతో తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహం

  • యువత, విద్యార్థులపై బీజేపీ ప్రత్యేక ఫోకస్
  • ఫీజు బకాయిలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ
  • ‘నమో జెన్-జీ కాన్‌క్లేవ్స్’తో యువతను ఆకర్షించే ప్రయత్నం
  • డిజిటల్ ప్రచారంతో జెన్-జీకి చేరువవుతున్న కమలనాథులు
  • జెన్-జీకి కేబినెట్‌లో చోటు కల్పించాలని బీజేపీ డిమాండ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు పక్కా కార్యచరణను సిద్ధం చేస్తోంది. జాతీయస్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు, యువత ఉద్యమానికి అన్ని విధాలుగా కాంగ్రెస్ అండగా నిలబడిందని భావిస్తున్న బీజేపీ… తెలంగాణలో అదే జెన్-జీ అస్త్రాన్ని హస్తం పార్టీ ప్రభుత్వంపై ప్రయోగిస్తోంది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంపై గంపెడాశలు పెట్టుకున్న కమలనాథులు ఢిల్లీలో జంతర్ మంతర్ విద్యార్థుల ధర్నాతో అప్రమత్తమయ్యారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు జెన్-జీ అస్త్రాన్నే ప్రయోగించాలని నిర్ణయించారు.

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు జెన్-జీ మీద దృష్టి కేంద్రీకరించడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా యువత, విద్యార్థులపై ఫోకస్ పెంచింది. మిగతా పార్టీల కంటే వేగంగా యువత, విద్యార్థులు కాషాయ ఛత్రం కిందకు వచ్చేలా తెలంగాణలో పావులు కదుపుతోంది. అందులో భాగంగా తెలంగాణలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలపై టీ. బీజేపీ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.

విద్యార్థుల ఫీజు సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం…

యువతలో పెరిగిన నిరుద్యోగ సమస్యను, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ అంశాలను బీజేపీ ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగానే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” పేరుతో సరికొత్త పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 25 వరకు నెల రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1800 విద్యాసంస్థలకు బీజేవైఎం నేతలు నేరుగా వెళ్లి ఫీజు బకాయిలపై విద్యార్థుల సంతకాలతో పత్రాలను సేకరించనున్నారు. ఆగస్టు 17న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించనున్నారు. ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్‌లో ఫీజు బకాయిలపై భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆహ్వానించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నమో జెన్-జీ కాన్‌క్లేవ్లు…

రాబోయే ఎన్నికల్లోనూ, పార్టీ విస్తరణలోనూ కొత్త తరం ఓటర్లే కీలకం అని భావిస్తున్న బీజేపీ, తమ ఫోకస్‌ను యువత, విద్యార్థుల వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే “నమో జెన్-జీ కాన్‌క్లేవ్” పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలేజీ ప్రాంగణాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పట్టు సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో యువతకే 90 శాతం వరకు అవకాశాలు ఇస్తామని పార్టీ నాయకత్వం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలంటే సాంప్రదాయ ఓటుబ్యాంకుతోపాటు సరికొత్త ఆలోచనలతో ఉన్న యువతను పార్టీ వైపు తిప్పుకోవడం ఒక్కటే మార్గమని కమలనాథులు భావిస్తున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా జెన్-జీ స్టూడెంట్స్ కాంక్లేవ్ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రధాని మోదీ కూడా స్టార్టప్‌లు, యువత అంటూ ప్రసంగాలు ఇచ్చారు. యువతకు అండగా ఉంటామని, యువ భారత్ అంటూ ప్రధాని చెబుతూ వస్తున్నారు.

ఇన్స్టా, ఎక్స్ వేదికగా జెన్-జీకి చేరువ…

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ముద్ర యోజన వంటి పథకాలను వివరిస్తూ ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే సందేశాన్ని జెన్-జీకి చేరవేస్తోంది. ఇప్పటి తరం కుల, ప్రాంతీయ సమీకరణల కంటే జాతీయవాదం, టెక్నాలజీ, డెవలప్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకోసమే ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ షార్ట్స్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా రీల్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో జెన్-జీ స్టైల్లోనే కమలనాథులు ప్రచారం మొదలుపెట్టారు.

రాష్ట్ర కేబినెట్‌లో జెన్-జీకి చోటు: బీజేపీ వ్యూహాత్మక డిమాండ్

ఉద్యోగాల భర్తీలో జాప్యం, పేపర్ లీకేజీల కారణంగానే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడ్డారు. ఏకంగా బీఆర్ఎస్‌ను అధికారం నుంచి దించేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాల కల్పనలో జాప్యం చేస్తోందని, ఫీజు బకాయిలు పేరుకుపోయాయని ఆరోపిస్తున్న బీజేపీ తాజాగా నిరుద్యోగ, విద్యార్థి అస్త్రాన్ని కాంగ్రెస్‌పై ప్రయోగించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగానే జెన్-జీకి రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించాలన్న డిమాండ్‌ను బీజేపీ అగ్రనేతలు తెరపైకి తెచ్చారు. తెలంగాణ కేబినెట్‌లో జెన్-జీకి చోటు కల్పించాలన్న బీజేపీ అగ్రనేతల డిమాండ్ రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖను యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై జెన్-జీ నేతను కూర్చోబెట్టాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హోం, విద్యా, మున్సిపల్ శాఖలు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన డిమాండ్ను సీఎం ముందుంచుతున్నారు. ఏకంగా హోంశాఖ మంత్రి పదవిని కాంగ్రెస్‌లోని యువ ప్రజాప్రతినిధికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యువతలో జాతీయ భావాలు బలంగా ఉండటంతో దేశం మారాలంటే ప్రతి క్యాంపస్‌లో యువత గళం విప్పాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తున్నారు.