సర్కారు భూముల కబ్జా.. చెరువులు మాయం.. భ్రమరా వెంచర్‌పై అక్రమాల నివేదిక

సర్కారు భూముల కబ్జా.. చెరువులు మాయం.. భ్రమరా వెంచర్‌పై అక్రమాల నివేదిక

  • రెవెన్యూ సమగ్ర సర్వేలో వెలుగుచూసిన అక్రమాలు
  • ప్రభుత్వ డొంకను వెంచర్ రోడ్డుగా మార్చినట్లు ఆరోపణలు
  • చెరువు కాలువలు పూడ్చివేత.. రైతులకు దారులు బంద్
  • ఎమ్మెల్యే కందుల జోక్యం.. కలెక్టర్‌కు నివేదన
  • ప్రభుత్వ చర్యలపై ఉత్కంఠ.. రైతుల న్యాయం కోసం ఎదురుచూపులు

మార్కాపురం, ఆంధ్రప్రభ : సర్కారు భూములు కబ్జా చేశారు. చెరువు కాలువలను మాయం చేశారు. రైతుల పొలాలకు దారులు బంద్ చేసి అరాచకం సృష్టించారు. మార్కాపురాన్ని కుదిపేస్తున్న భ్రమరా టౌన్షిప్ వివాదంపై రెవెన్యూ అధికారుల సమగ్ర సర్వే అసలు నిజాలను నిగ్గుతేల్చింది. నిబంధనలను తుంగలో తొక్కి సర్కారు డొంకలను వెంచర్ రోడ్లుగా మార్చేసిన బాగోతం బట్టబయలైంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆక్రమణలు, వనరుల ధ్వంసంపై సిద్ధమైన నివేదిక నిర్వాహకుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మార్కాపురంలో భ్రమరా టౌన్షిప్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సమగ్ర సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రైతులు చేసిన పలు ఫిర్యాదుల ప్రాథమిక ఆధారాలు లభించినట్లు అధికారులు నివేదికలో నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

వెంచర్ రోడ్డుగా సర్కారు డొంక

సర్వే నంబర్లు 130, 1313, 1295, 1309, 1308, 1312 పరిధిలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో భ్రమరా సంస్థ అప్రూవ్డ్ లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ఈ వెంచర్‌లోకి వెళ్లేందుకు సర్వే నంబర్ 1333లో ఉన్న చెరువును ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు.

చెరువు భూమి మీదుగా 60 అడుగుల వెడల్పుతో ఏకంగా 450 అడుగుల పొడవు రహదారి నిర్మించినట్లు అధికారులు చేపట్టిన సర్వేలో తెలుస్తోంది. ప్రారంభంలో ఇది అందరికీ ఉపయోగపడే రహదారి అని రైతులను నమ్మించిన నిర్వాహకులు, తర్వాత ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పొలాలకు వెళ్లే మార్గాలను మూసివేశారనే ఆరోపణలు నివేదికలో చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో అనేక మంది రైతులు తమ భూముల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువు కాలువలకు చెక్…

సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించే చెరువులోకి వచ్చే సహజ వర్షపు నీటి కాలువలను మట్టితో పూడ్చివేసినట్లు రైతులు చేసిన ఆరోపణలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. చిన్న చిన్న కాలువలు మూసివేయడంతో చెరువుకు నీటి ప్రవాహం తగ్గి ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని నివేదికలో కూడా నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అనుమతులు లేకుండానే నిర్మాణాలు….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయి సర్వే ఆధారంగా ఇతర అంశాలపైనా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

భూములు అమ్మకపోతే దారి బంద్…

జాతీయ రహదారికి అనుసంధానమయ్యే రహదారి పేరుతో భూములు తీసుకున్న సమయంలో తమ పొలాలకు కూడా ఇదే మార్గమని చెప్పారని రైతులు ఆరోపిస్తున్నారు. తర్వాత భూములు విక్రయించాలని ఒత్తిడి తెచ్చి, అంగీకరించని వారి పొలాలకు వెళ్లే దారులను ఫెన్సింగ్‌తో మూసివేశారని వారు వాపోతున్నారు. ఈ అంశమే ప్రస్తుతం వివాదానికి ప్రధాన కారణంగా మారినట్లు సమాచారం.

జేసీపై ఆరోపణలు… అసలు ఏం జరిగింది?

జాయింట్ కలెక్టర్ పాత్రపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లభించలేదని సమాచారం. రైతులు సుమారు 50 మంది గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ చేపట్టాలని మాత్రమే జేసీ ఆదేశించారని, నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జేసీపై వ్యక్తిగత ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే జోక్యం…

సమస్య తీవ్రత పెరగడంతో రైతులు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కలిసి తమ గోడును వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యే స్వయంగా వెంచర్ నిర్వాహకులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని తెలుస్తోంది. అనంతరం తనపై, జేసీపై ఆరోపణలు చేస్తూ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు ప్రసారం కావడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి, కలెక్టర్ దృష్టికి మొత్తం వ్యవహారాన్ని తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం.

గతం కూడా వివాదాలే…

భ్రమరా పేరుతో గతంలోనూ పలు వివాదాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. వినుకొండ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడంతో కొనుగోలుదారులు నిరసనలు చేపట్టిన ఘటనలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులతోనూ వివాదాలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఒంగోలులో ఓ వెంచర్ ఆవిష్కరణకు హాజరైన అధికార పార్టీ ఎమ్మెల్యే, అనంతరం వెంచర్‌లో లోపాలు ఉన్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.

తదుపరి అడుగు ఏంటి?

రెవెన్యూ శాఖ సిద్ధం చేసిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ, సహజ నీటి మార్గాల మార్పు, రైతుల రాకపోకలకు ఆటంకం వంటి అంశాలు నిజమని తేలితే సంబంధిత శాఖల ద్వారా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రైతులు మాత్రం తమ భూములకు దారులు పునరుద్ధరించి, చెరువుకు నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.