డాబాలపై జిల్లా పోలీసుల ఆకస్మిక తనిఖీలు

చిత్తూరు (ఆంధ్రప్రభ): జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని డాబాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డాబాల్లో జరుగుతున్న కార్యకలాపాలు, భద్రతా ప్రమాణాల అమలు, సీసీటీవీ వ్యవస్థలు, సిబ్బంది వివరాలు, పార్కింగ్, లైటింగ్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా చేపట్టారు.

ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చిన్నపేదయ్య తన సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలోని వారాహి డాబా, పప్పు డాబాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాబా యజమానులు సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని, సిబ్బంది పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడమే ఈ ప్రత్యేక తనిఖీల లక్ష్యమని పేర్కొన్న పోలీసులు, నిబంధనలు ఉల్లంఘించే డాబా యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.