ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు..

ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు..
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కల్లాల్లో రైతులు పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య, ఉదాసీన వైఖరి కారణంగా తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు.
ముందస్తుగా సరైన కొనుగోలు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, బీజేపీ పర్యటన ప్రకటించిన తర్వాతే సమస్య తీవ్రతను గుర్తించి చర్యలు ప్రారంభించిందని ఆయన ఆరోపించారు.
బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రానికి చేరుకునే ముందు హడావిడిగా ధాన్యాన్ని లారీల్లో నింపి పరిస్థితి సక్రమంగా ఉందనే భ్రమ కల్పించే ప్రయత్నం చేశారని అన్నారు. నిన్ననే కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు వచ్చాయని రైతులు తెలిపినట్లు పేర్కొన్నారు.
ధాన్యం తరలించేందుకు లారీలను పంపుతున్నామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తమకు చెప్పారని తెలిపారు. బీజేపీ జోక్యంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
లేకపోతే ఆరుబయట పడి ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యం వానకు తడిసి, ఎండకు ఎండిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల హక్కుల సాధన కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని, ప్రతి రైతుకు కనీస మద్దతు ధర దక్కే వరకు, ప్రతి గింజను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, సూర్య ప్రకాష్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, రాష్ట్ర కార్యదర్శి కొప్పు బాషా, కిసాన్ మోర్చా అధ్యక్షులు లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ రెడ్డి, లేగ రామ్మోహన్ రెడ్డి, ఉడుగుల రమేష్, బల్ల శ్రీనివాస్, బొజ్జపల్లి సుభాష్, పెరుమాళ్ళ వెంకటేష్, యుగేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకలు ఉమారాణి, అంజి రెడ్డి, భాగాల నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య, లక్ష్మారెడ్డి, సుజన్, ముత్యాలు కిసాన్, మోర్చా నాయకులు వెంకట రెడ్డి, పట్టణ అధ్యక్షులు అనిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
