ఎడతెరిపి వానతో జలమయమైన మంథని
మంథని (ఆంధ్రప్రభ): మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంథని పట్టణం జలమయమైంది. బస్టాండ్ ప్రాంతంతో పాటు మున్సిపల్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గతంలో భారీ వరదలు సంభవించిన అనుభవం ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వర్షాలు కురవవన్న అంచనాల మధ్య కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నప్పటికీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా గడుపుతున్నారు.
పరిస్థితిని మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ స్వయంగా పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని సూచించారు. అవసరమైన సహాయాన్ని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
