ఆపదలో అండగా సర్పంచ్..

ఆపదలో అండగా సర్పంచ్..

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

చిట్యాల, ఆంధ్రప్రభ: గ్రామ ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందిస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన సేవాభావాన్ని చాటారు.

చిట్యాల మండలంలోని సుంకెనపల్లి గ్రామానికి చెందిన గండికోట యాదగిరి శనివారం అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్ మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంత్యక్రియల నిర్వహణకు తన వంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

సర్పంచ్ చేసిన ఈ సహాయాన్ని గ్రామస్తులు అభినందించారు. ప్రజా సేవలో ఆమె చూపుతున్న చొరవ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.