Sangareddy | సేవాభావానికి చిరునామ‌ వడ్డె ఓబన్న

Sangareddy | సేవాభావానికి చిరునామ‌ వడ్డె ఓబన్న

  • జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్. పాండు

Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశభక్తి, త్యాగం, సేవాభావం వంటి ఉన్నత విలువలను యువతలో పెంపొందించడమే మహనీయుల జయంతి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆర్. పాండు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డెర ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ పాండు, వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వడ్డె ఓబన్న సాగించిన పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో మరువలేనిదని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయన చేసిన త్యాగాలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన మహనీయుడిగా వడ్డె ఓబన్నను గుర్తుచేసుకున్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన జీవితం, చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభు గౌడు, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్, బీసీ యూత్ అధ్యక్షుడు గోరుగంటి రమేష్ కుమార్, కుమ్మరి సంఘం అధ్యక్షుడు కుమ్మరి సాయిలు, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్‌తో పాటు వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.