జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా) ఆంధ్రప్రభ : జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని, మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని నేడు ఆయన ప్రారంభించారు. నియోజవర్గ వ్యాప్తంగా రూ.494.67 కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరా గాంధీది వియదీయరాని అనుబంధమని తెలిపారు. ఆమె మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే అమరులవ్వడం బాధకరమరని అన్నారు.
మెదక్ జిల్లాకు, దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకుంటూ, “మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా” అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, అవసరమైన నిధులను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. పటాన్‌చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిదని, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని సీఎం గుర్తుచేశారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జహీరాబాద్ అభివృద్ధిలో గీతారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
గేట్‌వే ఆఫ్ ఇండస్ట్రీస్‌గా జహీరాబాద్
మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గేట్ వే ఆఫ్ ఇండస్టీస్‌గా జహీరాబాద్ కావాలని కృషి చేస్తామని అన్నారు. జహీరాబాద్ పారిశ్రామిక వాడ భూసేకరణలో అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. భూములిచ్చిన రైతులకు పరిహారం పెంచామని తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. జహీరాబాద్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని కామెంట్ చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని పోతామని తెలిపారు. ముఖ్యంగా నారాయణ ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేకంగా సమీక్ష చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం
భవిష్యత్తులో మెదక్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని సీఎం అన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌ను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకు త్వరలోనే నిధులు కూడా మంజూరు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చి వెంటనే రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. గత ప్రభుత్వంలోని నాయకులు వరి వేస్తే ఉరే అని చెప్పేవారని రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణిస్తున్నారని.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత్ ప్రయాణం కోసం రూ.5 వేల కోట్లకు పైగా కేటాయించామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్నామని అన్నారు. అదానీ, అంబానీలతో పోటీపడి వ్యాపారం చేసేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం తీసుకుంటాం
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని చెప్పారు.
ప్రతిపక్షనేతకు వినతి
ప్రతిపక్ష నాయకుడికి తాను విజ్ఞప్తి చేస్తున్నాని, శాసనసభకు రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని సీఎం అన్నారు. తాము ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి.. సరిదిద్దుకుంటామన్నారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని మీరు అనుకుంటే.. ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలని, గెలిచినా, ఓడినా ఎప్పుడూ ప్రజల్లోనే తాను ఉన్నానని చెప్పారు. సీఎం అయ్యాక కూడా తాను ఏనాడు అహంభావం ప్రదర్శించలేదని చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకాన్ని అమలు చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలతో పోటీ పడేలా మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.
స్థానికంగా చక్కెర పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు సహకార సంఘంగా ఏర్పడితే, నిమ్జ్‌లో వంద ఎకరాల భూమి కేటాయించడంతో పాటు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ సభలో సీఎం చేసిన ప్రకటనలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.