Sangareddy మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి

Sangareddy మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి

  • సంగారెడ్డిలో సైనిక సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తాం: బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు

సంగారెడ్డి (Sangareddy), ఆంధ్రప్రభ:

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు తెలిపారు.

బుధవారం సంగారెడ్డి ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి ఆయనకు స్వాగతం పలికి కార్యాలయ పనితీరు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

అనంతరం మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో వారి సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు.

మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంగారెడ్డిలో సైనిక సంక్షేమ భవనం లేకపోవడం బాధాకరమని, అలాగే ఈసీహెచ్‌ఎస్ పాలిక్లినిక్ ఏర్పాటు చేయాలని కోరారు. డీజీఆర్ వేతనాల సవరణ, వ్యవసాయ భూములు, గృహ స్థలాల కేటాయింపు, అసైన్డ్ భూములకు ఎన్‌వోసీ, టీజీపీఎస్సీ నియామకాల్లో సడలింపులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపు వంటి అంశాలను కూడా డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు మాట్లాడుతూ అన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి మాట్లాడుతూ డైరెక్టర్ తొలి సందర్శనలోనే సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా సైనిక బోర్డు సభ్యులు తోపాజీ అనంతకిషన్, కూన వేణుగోపాల కృష్ణ, దశరథ్, వటపత్ర సాయి, సిద్దిపేట మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు బందెల సురేందర్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply