అక్రమ‌ కల్లు దుకాణాన్ని ప్రోత్స‌హిస్తున్న అధికారులు …

అక్రమ‌ కల్లు దుకాణాన్ని ప్రోత్స‌హిస్తున్న అధికారులు …

  • ఎక్సైజ్ అధికారుల తీరుపై గ్రామ‌స్తుల ఆగ్ర‌హం
  • దుకాణాన్ని సీజ్ చేసినా.. కొన‌సాగుతున్న క‌ల్లు అమ్మ‌కం
  • చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌కు గ్రామ‌స్తుల విజ్ఞ‌ప్తి

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : కొంతమంది ఎక్సైజ్ అధికారులు అవినీతికి పాల్పడి అక్రమ కల్లు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారని వారిపై వెంటనే చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని బోర్ప‌ట్ల గ్రామ‌స్తులు డిమాండ్ చేశారు. హ‌త్నూర మండలం బోర్ప‌పట్లలో అనుమ‌తిలేని క‌ల్లు దుకాణాన్ని సీజ్ చేసినా కొంద‌రు అవినీతి అధికారుల ప్రోత్సాహంతో తిరిగి అమ్మ‌కాలు కొన‌సాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అధికారుల తీరును నిర‌సిస్తూ.. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అనంత‌రం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ వినతిపత్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌గౌడ్ బోర్ప‌పట్ల గీత పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు సత్యగౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఆరు నెలల నుండి సొసైటీకి విరుద్ధంగా అక్రమ కల్లు దుకాణం నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విమ‌ర్శించారు.

ఇతరుల నుంచి కల్లుగీత సొసైటీకి ఇలాంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణగౌడ్, రవిగౌడ్ పి.వెంకటేశంగౌడ్, బోరుపట్ల గ్రామ సొసైటీ సభ్యులు చిన్నగౌడ్, అంజాగౌడ్ నరసింహగౌడ్ నాగరాజ్‌గౌడ్, మల్లేశం, ప్రవీణ్, రమేష్, లక్ష్మి, సిద్ధమ్మ, సత్యమ్మ, మానెమ్మ, చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply