నగరంలో ఎక్సైజ్ అధికారుల విస్తృత తనిఖీలు
- కొత్త బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు
- బ్యాగ్‌ను తనిఖీ చేయగా 5.210 కేజీల ఎండు గంజాయి లభ్యం
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు, 5 సెల్‌ఫోన్స్ స్వాధీనం
- ఎక్సైజ్ సీఐ బి. కృష్ణ వెల్లడి
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఈఎస్ జానయ్య పర్యవేక్షణలో సోమవారం నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహంచారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 5.210 కేజీల ఎండు గంజాయి లభ్యమయ్యింది. అధికారులు ముగ్గరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇదరు ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళలు కాగా, ఒకరు ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. గంజాయిని వారు ఒడిశా నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అధికారులు వారి వద్ద ఉన్న 5 సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ బి. కృష్ణ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారం లాంటి తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డ్రగ్స్, గంజాయి లాంటి కేసుల్లో ఇరుక్కొని కెరీర్ పాడుచేసుకోవద్దన్నారు. విద్యార్థులపై చిన్న కేసు నమోదైనా బ్యాడ్ రిమార్క్ ఉంటుందన్నారు. దీని ప్రభావం ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక నుంచి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్‌ఐలు జయశ్రీ, సాయిబాబా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
