ఘర్షణలు, కేసులతో జీవితాలు పాడు చేసుకోవద్దు: డీఎస్పీ హనుమంతరావు

నాదెండ్ల, ఆంధ్రప్రభ: గ్రామాల్లో చిన్నచిన్న వివాదాలకు ఘర్షణలు, కేసుల వరకు వెళ్లి జీవితాలను అంధకారంలోకి నెట్టుకోవద్దని నరసరావుపేట డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు సూచించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని చందవరం గ్రామంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గతంలో చందవరం గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో అనేక మంది పోలీసు కేసుల్లో చిక్కుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికలు ఒకరోజు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా జీవించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు. యువత గంజాయికి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పిల్లలను విద్యాబాటలో నడిపించాలని సూచించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. ఏటీఎంలలో నగదు తీసుకునే సమయంలో తెలియని వ్యక్తుల సహాయం తీసుకోవద్దని, అవసరమైతే పరిచయస్తుల సహాయం మాత్రమే పొందాలని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

చిలకలూరిపేట రూరల్ సీఐ బత్తిన సుబ్బనాయుడు మాట్లాడుతూ, గతంలో రాజకీయ విభేదాలతో చందవరం గ్రామంలో తీవ్ర ఘర్షణలు జరిగాయని, కొందరిపై రౌడీ షీట్లు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఒకప్పుడు నాటుసారా తయారీకి కేంద్రంగా ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారీ లేదా విక్రయాలు చేపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

కార్డన్ సెర్చ్‌లో అనుమతి పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, యజమానులు సరైన పత్రాలు సమర్పించిన తర్వాత వాటిని తిరిగి అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ సీఐ పి. రమేష్, నరసరావుపేట మొదటి పట్టణ సీఐ ఫిరోజ్, పలువురు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.