కాపు సమావేశాలపై అపోహలు వద్దు..

  • సంస్కరణ సభలు రాజకీయ వేదికలు కావు.. సామాజిక చైతన్యానికి మాత్రమే..
  • కాపు ఐక్యతపై చర్చలు సహజం
  • రాజకీయ పార్టీ అంశం ఊహాగానమే
  • ట్రోల్స్, తప్పుడు ప్రచారాలకు వాస్తవాలతోనే సమాధానం
  • అవకాశమిస్తే చంద్రబాబు నాయుడిని కలిసి పూర్తి వివరణ ఇస్తా
  • ఆంధ్రప్రభతో ప్రభుత్వ విప్ బోండా ఉమా స్పందనలు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ సమావేశాలు, వాటిపై రాజకీయ విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రభతో మాట్లాడారు. తాను ముద్రగడ్డ పద్మనాభం అభిమానులు నిర్వహించిన సంస్కరణ సభకు సామాజిక బాధ్యతతో మాత్రమే హాజరయ్యానని, దానిని రాజకీయ కోణంలో చూపించడం సరికాదన్నారు. టీడీపీ కాపు సామాజిక వర్గంతో సహా అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వ్యక్తిగత సమావేశాలను రాజకీయ రంగు పులమడం అనవసరమని పేర్కొన్నారు.

సంస్కరణ సభకు వెళ్లిన తర్వాతే అక్కడ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు హాజరయ్యారని తెలిసిందన్నారు. ముద్రగడ్డ పద్మనాభం అభిమానులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వివిధ పార్టీల నాయకులు హాజరుకావడం కొత్త కాదని, వాటిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమావేశాలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో కూడా ఒక సమావేశం నిర్వహించాలనే ఆలోచన మాత్రమే ఉందని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయం అయినా ఉంటుందని చెప్పారు. తనను ముద్రగడ్డ పద్మనాభం స్థానంలో కాపు నాయకత్వానికి తీసుకురావాలనే ప్రచారం పూర్తిగా ఊహాగానమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి ఆలోచన ఎవరికీ లేదని, కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ గౌరవించాలన్నదే తన అభిప్రాయమన్నారు.

2014 ఎన్నికల ముందు కానీ, ఆ తర్వాత కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాను ఎప్పుడూ విమర్శించలేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం కొందరు తాను మాట్లాడని మాటలను తన పేరుతో ప్రచారం చేస్తున్నారని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాపు సామాజిక వర్గం ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడం వంటి ప్రచారాలన్నీ నిరాధార ఊహాగానాలేనని పేర్కొన్నారు.

అలాంటి అంశాలపై చర్చించడం కూడా అనవసరమన్నారు. టీడీపీ క్రమశిక్షణ కమిటీకి పూర్తి వివరణ ఇచ్చిన అనంతరం అవకాశం లభిస్తే ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసి వ్యక్తిగతంగా కూడా వివరణ ఇస్తానని తెలిపారు. పార్టీ పట్ల తనకు పూర్తి నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలను సమానంగా గౌరవిస్తుందని, కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వ్యక్తిగతంగా లేదా సామాజికంగా జరిగే సమావేశాలను రాజకీయ వివాదాలుగా మార్చే ప్రయత్నాలు మంచివి కావని, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించిందని, అనవసర రాజకీయ ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.