భద్రతలో సింగరేణి దేశానికే ఆదర్శం
- ప్రమాదరహిత ఉత్పత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంస్థ
- 56వ వార్షిక భద్రతా పక్షోత్సవంలో డీజీఎంఎస్ డైరెక్టర్ జనరల్ ఉజ్జ్వల్ తాహ్
గోదావరిఖని, ఆంధ్రప్రభ : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణి, భద్రతా ప్రమాణాల అమలులోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) ఉజ్జ్వల్ తాహ్ అన్నారు. సోమవారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సింగరేణి 56వ వార్షిక భద్రతా పక్షోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కార్యక్రమాన్ని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉజ్జ్వల్ తాహ్ మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు గనుల్లో భద్రతా ప్రమాణాలను మరింత పెంపొందించాలని సూచించారు. ప్రమాదరహిత ఉత్పత్తే సంస్థ లక్ష్యంగా కొనసాగాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
సింగరేణి రెస్క్యూ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని కొనియాడిన ఆయన, భద్రతా చర్యల అమలులో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధికి సమిష్టి కృషి, భద్రతా సంస్కృతి అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీవై డీజీఎంఎస్ టీ.ఆర్. కన్నన్, సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్) ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, డీజీఎంఎస్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అనంతరం రామగుండం ఏరియా–1 జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్ స్వాగతోపన్యాసం చేయగా, కార్పొరేట్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ) కె. సాయిబాబు వార్షిక భద్రతా నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా భద్రతా సావనీర్‌ను ఆవిష్కరించి, భద్రతా పక్షోత్సవంలో విశేష ప్రతిభ కనబరిచిన గనులు, విభాగాలు, అధికారులు, ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
