ఎన్ఐటీ వరంగల్‌కు అరుదైన గౌరవం…

హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్ఐటీ) వరంగల్‌కు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. మహారాష్ట్రలోని వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన ఐసీఎస్సీడీఈ–2026 (ICCSCDE-2026) అంతర్జాతీయ సదస్సులో ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన పరిశోధకురాలు ఎం. రుతుజా పాటిల్ సమర్పించిన పరిశోధనా పత్రం ‘బెస్ట్ పేపర్ అవార్డు’ను అందుకుంది.

ఈ పరిశోధనను డాక్టర్ వసుధ డి. కటారే మార్గనిర్దేశకత్వంలో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్న ఈ సదస్సులో ఎన్ఐటీ వరంగల్ బృందం ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది. ఈ అవార్డు ద్వారా ఎన్ఐటీ వరంగల్ పరిశోధనా ప్రమాణాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనించాయని విద్యావర్గాలు పేర్కొన్నాయి. ఈ విజయంతో సంస్థకు మరింత ప్రతిష్ఠ లభించిందని అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.