Russia | లోకేష్ పెట్టుబడుల వేట!

Russia | లోకేష్ పెట్టుబడుల వేట!

ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రష్యా పర్యటన కొనసాగిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో కీలక సమావేశాలు నిర్వహించారు. ఆధునిక రవాణా వ్యవస్థలు, సెమీకండక్టర్ తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

రష్యా పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ మాస్కో అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. మాస్కో ట్రాన్స్‌పోర్ట్ కాంప్లెక్స్‌లో వివిధ విభాగాధిపతులు ఆయనకు స్వాగతం పలికారు. యాంఫి థియేటర్‌లో మాస్కో ఆటోనమస్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ అభివృద్ధిపై పావెల్ బోక్షా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, మాస్కో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు, పనితీరును మస్తిస్లావ్ ఇసాకోవ్ వివరించారు. అనంతరం అధునాతన టికెటింగ్ సిస్టమ్స్, డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీని లోకేష్ పరిశీలించారు.

మాస్కోలో అమలవుతున్న మెట్రో, బస్సు, రైలు, బైక్ షేరింగ్, స్కూటర్ నెట్‌వర్క్‌ల సమన్వయం, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ టికెటింగ్, రియల్ టైమ్ భద్రతా వ్యవస్థలు తనను ఆకట్టుకున్నాయని లోకేష్ పేర్కొన్నారు. భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కూడా ఇలాంటి సాంకేతిక ఆధారిత సమగ్ర రవాణా వ్యవస్థలు అవసరమని అభిప్రాయపడ్డారు.

అనంతరం రష్యాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ తయారీ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో విస్తరిస్తున్న డిజిటల్ రవాణా, బ్యాంకింగ్ కార్డ్ వ్యవస్థలకు అవసరమైన సురక్షిత RFID ట్యాగ్‌లు, స్మార్ట్ కార్డ్ మైక్రోచిప్‌ల తయారీ కోసం విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను కోరారు.

అలాగే ప్రపంచంలోని ప్రముఖ అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రుసాల్ వ్యవస్థాపకుడు ఒలేగ్ డెరిపాస్కాతో లోకేష్ సమావేశమయ్యారు. భారత పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అల్యూమినియం పెరుగుతున్న పాత్రపై చర్చించారు. మొబిలిటీ, పునరుత్పాదక ఇంధనం, నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే లోహాలు, ఖనిజాలు, డౌన్‌స్ట్రీమ్ తయారీ పరిశ్రమలకు కీలక కేంద్రంగా ఎదుగుతోందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రుసాల్ అల్యూమినా రిఫైనరీ పెట్టుబడులు ఉండటంతో భవిష్యత్తులో మరింత విస్తృత సహకారం అందే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన ఉపాధి అవకాశాలు, కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి లభిస్తాయని తెలిపారు.

ఏపీపై స్బేర్‌బ్యాంక్ దృష్టి.. ఏఐ, బ్యాంకింగ్ రంగాల్లో సహకారానికి లోకేష్ ఆహ్వానం

రష్యా ప్రభుత్వ నియంత్రణలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్ (Sberbank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్, కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ భద్రత రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై చర్చించారు.

భారతదేశంలోని బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్‌బ్యాంక్ అభివృద్ధి చేసిన గిగాచాట్ (GigaChat) లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) సేవలను విస్తరించాలని మంత్రి లోకేష్ కోరారు. డిజిటల్ సేవల విస్తరణలో ఏఐ ఆధారిత సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అలాగే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న యూపీఐ నెట్‌వర్క్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి స్బేర్‌బ్యాంక్ రూపొందించిన అడ్వాన్స్‌డ్ వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఎగుమతిదారులకు వ్యవస్థీకృత రుణ సదుపాయాలు కల్పించే అంశంపైనా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను మరింత విస్తరించేందుకు స్బేర్‌బ్యాంక్ ముందుకు రావాలని మంత్రి లోకేష్ కోరారు.

రష్యా పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలతో మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, సాంకేతికత, ఉపాధి అవకాశాలను ఆకర్షించే దిశగా కీలకంగా మారుతున్నాయి.

Leave a Reply