AP | తిరువూరు ప్రజలకు ఎంపీ చిన్ని తీపి కబురు….

AP | తిరువూరు ప్రజలకు ఎంపీ చిన్ని తీపి కబురు….

  • రామచంద్రపురం ట్రాఫిక్ సమస్య కు ఎంపీ కేశినేని చిన్ని శాశ్వత పరిష్కారం
  • ఎన్ హెచ్-30 విస్తరణకు ఆమోదం తెలిపిన ఎన్ హెచ్ ఏ ఐ
  • రెండు వైపులసర్వీస్ రోడ్ల తో ఫోర్ లైన్ హైవే
  • విస్తరణ పనులకు 24 కోట్లు కేటాయింపు
  • చిన్ని మాట ఇస్తే పరిష్కారం వచ్చినట్టే అంటున్న ప్రజనీకం
  • మరోసారి ప్రజా మనిషిగా ఇచ్చిన మాట నెలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని

ఏ కొండూరు, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కృషికి మరో కీలక ఫలితం దక్కింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న తిరువూరు–ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిలోని రామచంద్రాపురం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది.

ఎంపీ చిన్ని ప్రత్యేక చొరవ, నిరంతర అనుసరణ ఫలితంగా జాతీయ రహదారి-30 విస్తరణకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారిక ఆమోదం తెలిపింది. సుమారు రూ.24 కోట్ల వ్యయంతో నాలుగు లైన్ల రహదారి నిర్మాణంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు.

దీంతో రోజువారీ ట్రాఫిక్ రద్దీకి చెక్ పడటమే కాకుండా వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు భారీ ఊరట లభించనుంది.రామచంద్రాపురం వద్ద రహదారి వెడల్పు లేకపోవడం, పెరిగిన వాహన రద్దీ కారణంగా గత కొన్నేళ్లుగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది.

కేవలం ఒక కిలోమీటర్ ప్రయాణానికి సైతం 20 నిమిషాలకుపైగా సమయం పట్టే పరిస్థితి ఉండేది. ప్రజల నుంచి వచ్చిన వినతులను సీరియస్‌గా తీసుకున్న ఎంపీ కేశినేని చిన్ని ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై పలుమార్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో సమావేశమై రహదారి విస్తరణ అత్యవసరతను వివరించడంతో పాటు, ప్రతిపాదనకు వేగంగా ఆమోదం లభించేలా ఢిల్లీలోనూ, స్థానిక స్థాయిలోనూ నిరంతరం అనుసరణ కొనసాగించారు. సాంకేతిక, పరిపాలనా అడ్డంకులను అధిగమిస్తూ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చే వరకు పట్టుదలతో కృషి చేశారు.

ప్రజల అవసరాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు చూపడంలో ఎంపీ చిన్ని చూపుతున్న చొరవకు ఇది మరో నిదర్శనంగా స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత ఎన్ హెచ్ 30 పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కానుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, “ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రధాన బాధ్యత అనీ, రామచంద్రాపురం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం సంతోషంగా ఉందన్నారు. పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తాననీ, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తాం” అని తెలిపారు.

ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా ఎంపీ కేశినేని చిన్ని మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం నిత్యం విజయవాడకు రాకపోకలు సాగించేది ఈ ప్రధాన రహదారిపైనే. అయితే రామచంద్రాపురం వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్య కారణంగా దశాబ్దాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొనేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎంపీ కేశినేని చిన్ని తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించి రహదారి విస్తరణకు ఆమోదం లభించడంతో తిరువూరు, మైలవరం ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ సమస్యకు పరిష్కార మార్గం చూపిన ఎంపీ చిన్ని పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. “ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పట్టుదలతో కృషి చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో రామచంద్రాపురం రహదారి విస్తరణ ఆమోదమే నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.”

Leave a Reply