బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సామాన్యులపై విద్యుత్ భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది కాలం పాటు వినియోగదారుల నుంచి ఎలాంటి ‘సర్ ఛార్జీలు’ వసూలు చేయకూడదని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని స్పష్టమైంది. సర్ ఛార్జీల నిలిపివేత : సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఖర్చులను బట్టి యూనిట్‌కు 30 పైసల వరకు సర్ ఛార్జీ వసూలు చేసేందుకు డిస్కంలకు అవకాశం ఉంటుంది.
అయితే, తాజాగా ఈ వసూళ్లను ఏడాది పాటు నిలిపివేస్తూ ఈఆర్సీ (ERC) ఉత్తర్వులు జారీ చేసింది. ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 2023-25 మధ్య పేరుకుపోయిన సుమారు రూ. 10,000 కోట్ల భారం ప్రజలపై పడకుండా నిలిచిపోయింది.
ఈ నిర్ణయం వల్ల డిస్కంలపై అదనపు భారం పడనుంది. కేవలం వడ్డీ రూపంలోనే డిస్కంలు సుమారు రూ. 300 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఏడాది తర్వాత కూడా వసూలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తే, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది.గత రెండేళ్లలో విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం వల్ల డిస్కంలపై రూ. 7,635 కోట్ల భారం పడింది. అయినప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారాన్ని ప్రజలకు బదిలీ చేయకూడదని సర్కార్ నిర్ణయించింది.
