పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహం..

మునుగోడు, ఆంధ్రప్రభ : పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు ముందుకొచ్చారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన 151 మంది విద్యార్థులకు మొత్తం రూ.24.5 లక్షల నగదు బహుమతులు అందజేశారు.

మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు చొప్పున చెక్కులు,జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అన్నారు.

విద్యార్థులు సెల్‌ఫోన్లు, వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. ఫౌండేషన్ చైర్ పర్సన్ లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం పేద కుటుంబాల్లో విద్యపై నమ్మకం పెంచుతోందని తెలిపారు.

Leave a Reply